వైసీపీ గెలుపుపై కోర్టుకెక్కిన బోండా ఉమా!!

 

తన ప్రత్యర్థి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన మల్లాది విష్ణుపై టీడీపీ నేత బోండా ఉమా హైకోర్టును ఆశ్రయించారు. తనపై 25 ఓట్లతో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోరారు. తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌ను లెక్కించాకే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదని బోండా ఉమా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు వ్యత్యాసాల్ని తాను గమనించానన్నారు. ఈ వ్యవహారమై అదే రోజు జిల్లా ఎన్నికల అధికారికి వినతి సమర్పిస్తూ ఫలితాల ప్రకటనకు ముందే వీవీప్యాట్స్‌ లెక్కింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తాను ఇచ్చిన వినతిపై ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు వ్యవహరించేలా ఎన్నికల అధికారిని ఆదేశించాలని బోండా ఉమా కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.