రాష్ట్ర పండుగలుగా బోనాలు, బతుకమ్మ

 

 

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ఇక నుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. సోమవారం జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో బతుకమ్మ పండుగతోపాటు బోనాల పండుగను కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. సమీక్షానంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ మీడియాకు ఈ విషయం చెప్పారు. జూలై 13 లేదా 14 తేదీల్లో సికింద్రాబాద్‌లో ప్రారంభం కానున్న బోనాల పండుగ వేడుకలు ఏడువారాలపాటు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని మంత్రి పద్మారావు తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రానున్న బోనాలు, రంజాన్ పండుగలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రంజాన్ పండుగకు సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారన్నారు. విద్యుత్ కోతల వల్ల అంతరాయం కలగకుండా మందిరాలు, మసీదుల వద్ద మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ జనరేటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పద్మారావు తెలిపారు.