TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు.. పోలీసులు అల‌ర్ట్‌..

Published on: Sun May 23, 2021 12:16PM

హ‌లో. పోలీస్ కంట్రోల్ రూమా? సీఎం ఇంట్లో బాంబు పెట్టాం. కాసేప‌ట్లో పేలిపోతుంది జాగ్ర‌త్త‌. అని చెప్పేసి ఫోన్ క‌ట్ చేశాడు అగంత‌కుడు. ఇక అంతే. పోలీసులు ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బాంబు స్క్వాడ్‌ నిపుణులు, పోలీసు జాగిలాల‌తో సీఎం ఇంటికి చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అణువ‌ణువూ గాలించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు క‌నిపించ‌లేదు. హ‌మ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్‌ కాల్‌ అని తేల్చారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి, విచార‌ణ చేపట్టారు. 

బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌తో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఇంట్లో క‌ల‌క‌లం రేపింది. ఈ వ్యవహారంపై తేనాంపేట పోలీసులు కేసు నమోదుచేసి, సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో ఆ ఫోన్‌ ఎక్కడ నుంచి వచ్చిందని విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంటిని బాంబుతో పేల్చివేస్తా మంటూ బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఆ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేనివాడని గుర్తించిన పోలీసులు హెచ్చరించి వదిలివేశారు. 

ఎగ్మూర్‌లో ఉన్న పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫోన్‌ చేసిన అపరిచిత వ్యకి, ఆళ్వార్‌పేట చిత్తరంజన్‌ వీధిలోని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు, మరి కొద్దిసేపట్లో పేలనుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన భువనేశ్వర్‌ (26) అనే యువకుడు ఈ చర్యకు పాల్పడ్డాడని గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భువనేశ్వర్‌ను విచారించి అతడికి మతిస్థిమితం లేదని తెలుసుకొని, అతడి తల్లిదండ్రులను పిలిపించి, మళ్లీ అతడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపారు. 

పోలీసుల విచార‌ణ‌లో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలూ వెలుగుచూశాయి. మ‌తిస్థిమితం లేని భువనేశ్వర్‌.. గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం, సినీనటులు రజినీకాంత్‌, విజయ్‌, అజిత్‌ తదితరుల ఇళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్‌ చేసినట్టు పోలీసుల విచారణలో తేల‌డంతో పోలీసులు అవాక్క‌య్యారు.