TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేరళలో ఏం జరుగుతోంది..?

Published on: Fri Mar 3, 2017 11:12AM

కేరళ అంటే ప్రకృతి అందాలకు నెలవు..పడవ ప్రయాణాలు, కొబ్బరి తోటలు, పర్యాటక ప్రాంతాలతో నిత్యం కళకళలాడే ఆ గాడ్స్ ఓన్ కంట్రీ ఇప్పుడు హత్యలు, దాడులతో అల్లాడుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు కేరళలలో నిప్పు రాజేశాయి. అప్పటికే ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులకు సీపీఎం శ్రేణులతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండటంతో చంద్రావత్ వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లైంది.

 

 

ఆయన ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే నిన్న రాత్రి కోజికోడ్ జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా అదే కోజికోడ్ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కార్యాలయాన్ని తగులబెట్టారు. ఈ వివాదం ఏకంగా హత్యలకు దారి తీసింది. పాలక్కాడ్ జిల్లాలోని ఎలప్పులిలో సీపీఎం అనుబంధ విభాగం డీవైఎఫ్ఐకు చెందిన ఇద్దరు కార్యకర్తలను హత్య చేశారు. దీంతో సీపీఎం ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయన్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.