కళ్లు చెప్పే మాటలు

మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసే ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సామాజిక జీవితం వాటిలో ముఖ్యమైనది. సమాజంలో మెలిగేందుకు, సంఘజీవిగా నిలదొక్కుకునేందుకు భాష, భావం... ఈ రెండూ చాలా అవసరం. భావాన్ని వ్యక్తీకరించడంలో మన కళ్లు చూపే ప్రతిభ అసాధారణం. మనిషి కళ్లలో ఉండే స్క్లెరా అనే తెల్లటి పదార్థం వల్ల మనిషి కనుగుడ్లు చిత్రవిచిత్రమైన భావాలను పలికించగలవు. అతని కనుగుడ్లలో మార్పులు, కదలికలను బట్టి.... అతను ఎటు చూస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అన్నది పసిగట్టేయవచ్చు. దీని గురించి ప్రత్యేకమైన శిక్షణ ఏమీ అవసరం లేదు. అలా తెలిసిపోతుందంతే! కాకపోతే మనకి తెలియకుండానే మన కళ్లు చేసే మాయ గురించి కాస్త అవగాహనను ఏర్పరచుకుంటే, కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉంటుంది.


- మనలో ఎంత విశ్వాసం ఉన్నాగానీ, అవతలి మనిషి కళ్లలోకి అదేపనిగా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే... ఎదుటివారికి వ్యతిరేక భావం కలుగుతుంది. ఎంతటి దగ్గరవారైనా కానీ మాట్లాడే సమయంలో 70 శాతం మించి సమయాన్ని కళ్లలో కళ్లు పెట్టి చూడకూడదంటున్నారు బాడీలాంగ్వేజ్‌ నిపుణులు.

 

- అదేపనిగా చూస్తే బాగోదు అంటూ ఒక పక్క సంభాషణ జరుగుతూ ఉన్నా కూడా దిక్కులు చూస్తూ ఉంటే అసలుకే మోసం వస్తుంది. మీలో ఏదో అపరాధ భావం ఉందనో, అవతలి మనిషంటే లెక్కలేదనో... చూపులతోనే చెప్పినట్లవుతుంది.


- కొంతమంది ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. పక్కచూపులతో వేరొకరిని చూస్తూ ఉంటారు. ఇది కూడా అవతలి మనిషిలో చిరాకు కలిగించే అంశమే! మాట్లాడే వ్యక్తికి సదరు పక్క వ్యక్తి అంటే అనుమానమో, ఆసక్తో ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది.

 


 

- సంభాషణ మధ్యలో అవతలివాడు కను రెప్పలను చాలా నిదానంగా మూసి, ఒక్క క్షణం అలా మూసే ఉంచుతున్నాడంటే... అతను నిరాసక్తిగా ఉన్నట్లే! ఒక రకంగా చెప్పాలంటే అవతలి మనిషిని కాసేపు మర్చిపోవడానికి కళ్లు మూసుకున్నాడని అనుకోవచ్చు. ఇక దానికి తోడు సుదీర్ఘమైన నిట్టూర్పు కూడా వచ్చిందంటే అతని మీద జాలి పడక తప్పదు. అలా కాకుండా అవతలి వ్యక్తి మాట్లాడుతూ మాట్లాడుతూ తెగ కళ్లని ఆర్పుతున్నాడంటే... అతను ఏదో ఉద్వేగంలో ఉన్నట్లు లెక్క.


- సంభాషణలో మనం ఎదుటివారి వంక చూస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు రకాలుగా మన చూపుని వారి మీద కేంద్రీకృతం చేస్తాము. ఒకటి ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత అతని నుదుటి మధ్యలోకి... అంటే ఒక త్రిభుజాకారంలో వారిని గమనిస్తాము. లేదా ఎదుటివారి కళ్లలోకి, ఆ తరువాత వారి నోటి వైపుకీ... అంటే తలకిందులుగా ఉన్న త్రిభుజాకారంలో చూస్తాము. మొదటి పద్ధతిలో ఎదుటి వారి మీద మనం ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నామన్న హెచ్చరికను అందచేస్తుంది. పై అధికారులు, ఇంటర్వూ చేసేవారు ఇలాంటి చూపులు చూస్తుంటారు. ఇక రెండో పద్ధతిలో అవతలివారితో స్నేహపర్వకంగా మెలుగుతున్న సూచనను తెలియచేస్తుంది.

 

 


 

- కేవలం సంభాషణలోనే కాదు. ఒక మనిషి ఒంటరిగా ఉన్నా కూడా అతని కళ్లు ఏం చేస్తున్నాయదన్నదాటి బట్టి అతని మనస్థితిని గ్రహించవచ్చు. ఎదో గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా, వైరాగ్యంలో ఉన్నాడా, తనలో తాను మాట్లాడుకుంటున్నాడా అన్నది అతని కళ్లని బట్టి తేలిపోతుంది. అదెలాగంటారా! మీరే ఆ భావాలను అనుకరించడానికి ప్రయత్నించండి! ఆ సమయంలో మీ కళ్లు అసంకల్పితంగానే మీ స్థితికి అనుగుణంగా కదలడాన్ని గమనిస్తారు.


సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఈ లోకాన్ని చూడటానికే కాదు, మీ భావాలను అవతలివారితో పంచుకోవడంలో కూడా ముఖ్యపాత్రని వహిస్తాయి. అందుకే శరీరభాష (బాడీలాంగ్వేజ్‌)లో కళ్లకి ఉన్న ప్రాధాన్యత అసాధారణం. మీ ఆసక్తి, ఓపికలని బట్టి కంటి భాష గురించి ఎన్ని వివరాలనైనా సేకరించుకోవచ్చు.

- నిర్జర.