గోదావరిలో తప్పిన ప్రమాదం.. వంద మంది ప్రాణాలతో చెలగాటం
Published on: Fri May 10, 2019 4:05PM

గోదావరి నదిలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. పంటు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వంద మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గంటన్నరపాటు గడిపారు.
మాధవాయిపాలెం- సఖి నేటిపల్లి రేవు మధ్య నడుస్తున్న పంటు గోదావరి నదిలో గురువారం అర్ధారంతంగా నిలిచిపోయింది. దీంతో ఆ పంటులో ప్రయాణిస్తున్న సుమారు 100 మంది ప్రయాణీకులు గంటన్నర పాటు భయంతో తల్లడిల్లిపోయారు. సరిగ్గా రాత్రి 9గంటల సమయంలో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవు నుంచి మాధవాయిపాలెం రేవుకు ప్రయణీకుల్ని చేరవేయడానికి బయలుదేరింది. ఆ పంటులో వివిధ వాహనాలతో పాటు సుమారు 100 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే నది మధ్యకురాగానే ఇంజన్‌లోని అయిల్ అయిపోవడంతో పంటు ఒక్కసారిగా నిలిచిపోయింది.
ఓ వైపు నది ప్రవాహం, మరోవైపు అదేసమయంలో గాలులు బలంగా వీయడంతో పంటు కొంత దూరం వేరే మార్గంలోకి వెళ్లిపోయింది. పంటు దరి చేరే అవకాశం లేకపోవడంతో ప్రయాణీకులు ప్రాణాలను చేత పట్టుకుని కేకలు వేస్తూ భీతిల్లిపోయారు. అయితే నది మధ్యలో చేపల కోసం మత్స్యకారులు వేసిన వలకట్లు అడ్డుగా రావడంతో పంటు ఆగింది.
సమాచారం తెలుసుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ కృష్ణమోహన్ హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమరేశ్వర గట్టు నుంచి పరిస్థితిపై ఆరా తీశారు. చివరికి రూరల్ ఎస్‌ఐలు మూర్తి, చంద్రశేఖర్, మల్లికార్జునరెడ్డి నాటు పడవలో గోదావరిలో నిలిచిన పంటు వద్దకు వెళ్లారు. పంటులో అయిల్ నింపడంతో ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు, ఆధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వలకట్లు అడ్డుపడకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేదని మత్స్యకారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


