బోటులో మరికొన్ని ఎముకలు, అవయవాలు... అందరూ దొరికినట్లే...కానీ డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే

కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాల వేదన హృదయవిదారంగా ఉంది. ప్రమాదం జరిగాక దఫాదఫాలుగా 39 మృతదేహాలను వెలికితీసి బంధువులకు అప్పగించిన అధికారులు.... ఇంకా 13మంది ఆచూకీ కోసం 39రోజులు ఆగాల్సి వచ్చింది. 38రోజుల తర్వాత ఎట్టకేలకు బోటును బయటికి తీయడంతో తమవాళ్ల మృతదేహాలు దొరుకుతాయని ఆశపడ్డ బాధిత కుటుంబాల్లో కొందరికి నిరాశే ఎదురైంది. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డ ఆత్మీయులు ఆశలు గల్లంతయ్యాయి. బోటు నుంచి 8మృతదేహాలు వెలికితీయగా... ఐదుగురిని మాత్రమే గుర్తించారు. అయితే, బోటు నుంచి వెలికితీసిన మృతదేహాలన్నీ కుళ్లిపోయి ఛిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఐదుగురిని గుర్తించగలిగారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే, రాయల్ వశిష్ట బోటును శుభ్రం చేయడంతో మరికొన్ని ఎముకులు, అవయవాలు, వస్త్రాలు దొరికాయి. దాంతో వాటిని కూడా మూటలుగా కట్టి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాంతో మొత్తం మృతదేహాలు దొరికినట్లేనని అంటున్నారు.

అయితే, పలువురి మృతదేహాలు ఛిద్రమైపోవడం... అలాగే అవయవాలు తెగిపోయి కొన్ని భాగాలు మాత్రమే దొరకడంతో వాళ్లను గుర్తుపట్టడం కష్టంగా మారిందని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం... అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు తెగిపోయి ఉండటం... మరికొన్ని మృతదేహాలైతే కేవలం ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రం దొరకడంతో... డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపుతున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతని కుమారుడు గుర్తించాడు. టీషర్ట్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపాడు. అలాగే, వరంగల్ వాసులైన కొమ్ముల రవీంద్ర, ధర్మరాజు మృతదేహాలను వాళ్ల జేబుల్లో దొరికిన ఐడీ కార్డుల ఆధారంగా మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. ఇక, మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో... ఆ తర్వాత బోటు నుంచి తీసుకొచ్చిన ఎముకలు, మాంసపు ముద్దల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా దొరక్కపోవడంతో రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్యశ్రీ తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు.

మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన రాయల్ వశిష్ట బోటు బయటికొచ్చినా... బాధిత కుటుంబాల్లో కొందరికి మాత్రమే కొంతలో కొంత ఊరట లభించలేదు. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం లభించింది. అయితే, మిగతా మృతదేహాలన్నీ ఏ రకంగానూ గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో ఆయా బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతంగా ఉంది. ఇక, ఆచూకీ దొరకాల్సిన, గుర్తించాల్సిన ఆరేడు మంది వివరాలు డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే తేలే అవకాశం కనిపిస్తోంది.

Related Segment News