రక్తాన్ని బట్టి మనస్తత్వం చెప్పేస్తారు

 

తెలుగు హీరోలు తరచూ తమ రక్తానికి ఉన్న మహిమ గురించి పుంఖానుపుంఖాలుగా డైలాగులు చెబుతూ ఉంటారు. అసలు రక్తాన్ని బట్టి పౌరుషం ఉంటుందా? ఒక మనిషి రక్తాన్ని బట్టి అతని గుణగణాలను అంచనా వేయవచ్చా అని ప్రేక్షకులు తల బాదుకోవచ్చుగాక! కానీ జపాన్‌, కొరియా, తైవాన్ వంటి కొన్న దేశాలలలో ఇలాంటి నమ్మకాలు చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

 

90 ఏళ్ల నమ్మకం

మనిషి రక్తాన్ని A,B,O అనే మూడు రకాలుగా విభజించి వందేళ్లకు పైనే గడుస్తోంది. ఈ విభాగాలను చూసిన ‘టకేజీ ఫురుకవ’ అనే జపాను ప్రొఫెసరుగారికి ఓ వింత ఆలోచన వచ్చింది. వేర్వేరు మనుషులు వేర్వేరు బ్లడ్‌ గ్రూపులు ఉన్నట్లే, వేర్వేరు బ్లడ్‌ గ్రూపులు ఉన్నవారి గుణాలను కూడా అంచనా వేయవచ్చు కదా అన్నదే ఆ ఆలోచన. అనుకున్నదే తడవుగా టేకీజీగారు 1927లో ఓ పరిశోధనను వెలువరించారు.

 

పిచ్చిపిచ్చిగా నమ్మేశారు

టకేజీగారి సిద్ధాంతాలని జపాను జనం మారు ప్రశ్నించకుండా నమ్మేశారు. అప్పటి జపాన్‌ ప్రభుత్వం ఈ బ్లడ్‌గ్రూపులను అనుసరించి సైనికులను నియమించడం వరకూ ఈ నమ్మకం ఎదిగిపోయింది. తరువాత కాలంలో ఈ నమ్మకం కొంత పలచబడింది. కానీ 1970వ దశకంలో ‘మసాహికో నోమి’ అనే ఓ జర్నలిస్టు ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఏకంగా ఏడు పుస్తకాలు రాయడంతో మళ్లీ రక్త చరిత్ర మొదలైంది.

 

ఇవీ గుణాలు

జపానువారి బ్లడ్‌గ్రూప్‌ సైకాలజీ ప్రకారం వివిధ బ్లడ్‌గ్రూపుల స్వభావం ఇలా చెప్పుకోవచ్చు...
A – ఇది ఒక రైతుకి సరిపడే స్వభావాన్ని పోలి ఉంటుంది. ఈ బ్లడ్‌గ్రూపు ఉన్నవారు శాంతము, సహనము, బాధ్యత, నిజాయితీ, పట్టుదల కలిగి ఉంటారు.

B – ఇది ఒక వేటగాడిని గుర్తుకుతెస్తుంది. ఈ తరహా బ్లడ్‌గ్రూప్‌ ఉన్నవారు బలంగా, సృజనాత్మకంగా, నిర్దాక్షిణ్యంగా, సమాజపు కట్టుబాట్లను ధిక్కరించేలా, ఆశావహంగా ఉంటారు.

AB- ఇది ఒక మానవతావాదిని ప్రతిబింబిస్తుంది. AB బ్లడ్‌గ్రూపు ఉన్నవారు సమన్వయంగా, తార్కికంగా, నలుగురిలో కలిసిపోయేలా ప్రవర్తిస్తారు. కానీ వీరు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం లేకపోలేదు.

O -  ఈ బ్లడ్‌గ్రూప్ లక్షణాలు ఒక యోధుని గుర్తుకుతెస్తాయి. ఆత్వవిశ్వాసం, స్వతంత్ర భావాలు కలిగి ఉండటం, ఉద్రేకం, ఏదన్నా సాధించాలనే తపన, స్వార్ధం, అనుమానం వీరి లక్షణాలు.

 

ఆధారాలు లేకపోయినా

బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా ఒక వ్యక్తి మనస్తత్వాన్ని నిర్వచించేందుకు వందలాది పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరూ ఖచ్చితమైన ఆధారాలను చూపలేకపోయారు. కానీ మన దేశంలో రాశిఫలాలను ఎలా నమ్ముతారో జపాన్‌లో బ్లడ్‌గ్రూప్‌ ఆధారిత నమ్మకాలకు అంత ఆదరణ ఉంది. జపాన్‌లో ఎదుటివారి మనస్తత్వాన్ని అంచనా వేసేందుకు ‘మీ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటి?’ అని అడగటం సర్వసాధారణం. పెళ్లిళ్లు చేసుకునేటప్పుడు, ఉద్యోగులను నియమించేటప్పుడు కూడా వారు బ్లడ్‌గ్రూప్ మీదే ఆధారపడతారు. బ్లడ్‌గ్రూప్‌ ఆధారంగా కొందరిని లోకువగా చూడటం, ఏడిపించడం వంటి సంఘటనలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. 

 

ఇదీ జపానువారి రక్తచరిత్ర! నిజంగా ఒకో బ్లడ్‌గ్రూపునకూ ఒకో స్వభావం ఉంటుందో లేదో తెలియదు కానీ... మీది ఫలానా బ్లడ్‌గ్రూప్‌ కాబట్టి ఫలానా లక్షణాలు ఉంటాయని ఎవరన్నా చెబితే, అది మన మనస్తత్వం మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అంటే.. బ్లడ్‌గ్రూప్‌ సైకాలజీ నిజమైనా కాకపోయినా, దాన్ని నమ్మినవారు మాత్రం అలాగే ప్రవర్తిస్తారన్నమాట. ఇదో సైకాలజీ మరి!

 

- నిర్జర.