అట్టర్ ఫ్లాప్ సినిమాటికెట్లను కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తారా?
Published on: Sat May 12, 2012 12:38PM
కడపజిల్లా రాజంపేటను సినీథియేటర్ యజమానులు శాసిస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వీరు ఒకవైపు బ్లాక్ టిక్కెటింగ్, మరోవైపు పైరసీలకు పాల్పడుతున్నారు. బహిరంగంగా థియేటరు యజమానులు ఈ చర్యలకు పాల్పడుతున్నా అటు రెవెన్యూ, ఇటు జిల్లా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రాజంపేట నుంచి రాష్ట్రవ్యాప్తంగా పైరసీ సీడీలు విడుదలవుతున్నాయని సమాచారం ఉన్నా పోలీసులూ ఏమీ చేయలేకపోతున్నారు. ఇటీవల బిజినెస్ మెన్ సినిమాతో మొదలుపెట్టిన ఈ బ్లాక్ టిక్కెటింగ్ వ్యాపారం దమ్ము, గబ్బర్ సింగ్ సినిమా వరకూ ఏమాత్రం ఆగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాప్ అయిన సినిమాలను కూడా బ్లాక్ లో టిక్కెట్టు కోని చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది.
బిజినెస్ మ్యాన్ ఒక టిక్కెట్టు ధర 200 రూపాయలు పలికింది. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై థియేటరు యజమానులు దాడి చేయిస్తున్నారు. అలానే వినోదపుపన్ను కట్టకపోయినా స్థానిక యంత్రాంగం ప్రశ్నించటం లేదని థియేటరు యజమానులు బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. తాజాగా విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రం టిక్కెట్ ను 300 రూపాలకు, వెంకటేష్ నటించిన బాడీగార్డ్ టిక్కెట్టును వందరూపాయలకు, నందీశ్వరుడు టిక్కెట్టును మొదట వంద, ఆ తరువాత 70 రూపాయలకు అమ్మారని తెలిసింది. ఇలా బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్న థియేటర్లపై చర్య తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు. పైరసీలను అరికట్టడానికి నడుం బింగించే పోలీసు యంత్రాంగం కూడా థియేటరు యజమానుల ముందు సలాం కొడుతుంటారని తెలిసింది. ఒకరకంగా బ్లాక్ టిక్కెట్టు లాభానికి, పైరసీ వ్యాపారానికి అలవాటుపడ్డ రాజంపేట థియేటరు యజమానులు స్థానికంగా ఎవరినైనా బెదిరించి పంపించేయగలరని సినీప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు.


