TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీలో రికార్డులు తిరగరాసిన నల్ల బంగారం.. మే నెలలో 12 లక్షల మందికి పైగా భక్తుల తలనీలాలు!

Published on: Fri May 29, 2026 9:37AM

తిరుమల కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులలో భక్తుల రద్దీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది మే లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యతో పాటు, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న వారి సంఖ్య కూడా ఊహించని స్థాయికి చేరింది. ముఖ్యంగా తిరుమలలో  నల్ల బంగారం గా పిలవబడే భక్తుల తలనీలాల (కల్యాణకట్ట) సమర్పణలో ఈసారి సరికొత్త  రికార్డు నమోదైంది. ఒక్క మే నెలలోనే 12 లక్షల మందికి పైగా భక్తులు   తలనీలాలను సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

 వేసవి సెలవులు కావడంతో మే నెలలో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ రద్దీ మునుపెన్నడూ లేని విధంగా నమోదైంది. గతేడాది  మే నెలతో పోల్చి చూస్తే ఈ ఏడు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.  గతేడాది మే నెలలో  10 లక్షల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకుంటే.. ఈ ఏడాది మే లో  12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది రికార్డు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ఇది సాధ్యమైంది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి తరలివచ్చినప్పటికీ.. కల్యాణకట్టల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయీ బ్రాహ్మణులు అహర్నిశలు శ్రమించారు.  రోజుకు వేల సంఖ్యలో వచ్చే భక్తులకు తలనీలాలు తీయడం అంత సులువు కాదుఅయితే..  టీటీడీ కల్యాణకట్టల్లో పనిచేసే మహిళా, పురుష  క్షురకులు షిఫ్టుల వారీగా, 24 గంటల పాటు నిరంతరాయంగా సేవలు అందించారు. భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు వారు చేసిన కృషి పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలను టీటీడీ  నల్ల బంగారం గా పరిగణిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తిరుమల తలనీలాలకు భారీ డిమాండ్ ఉంది. వీటిని వివిధ గ్రేడులుగా విభజించి, ఈ-వేలం   ద్వారా విక్రయిస్తారు. తద్వారా టీటీడీకి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది మే లో రికార్డు స్థాయిలో 12 లక్షల మంది తలనీలాలు సమర్పించడంతో, రాబోయే రోజుల్లో ఈ-వేలం ద్వారా టీటీడీకి రికార్డు స్థాయి ఆదాయం రావడం ఖాయంగా కనిపిస్తోంది. వేసవి ముగుస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లోనూ టీటీడీ అదనపు సిబ్బందిని కేటాయించి సేవలందిస్తోంది.