తలుపు చెక్కతో నువ్వొకటి..తమల పాకుతో నేను రెండు..!
Published on: Mon Jun 6, 2022 7:25AM
కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి తననెవరూ చూడటం లేదనుకుంటుందట. బీజేపీ పరిస్థితీ అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్. చేసేదొకటి, చెప్పేదొకటీగా ఆ పార్టీ తీరు ఉందని పరిశీలకులు అంటుంటే. చెబుతున్నదీ, చేస్తున్నదీ ఒకటే లా ఉందని జనాలు నవ్వుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే రాష్ట్రంలో అధికార పార్టీకి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటూ.. మరో వైపు జనసేనతో మైత్రి కొనసాగించడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఏపీ బీజేపీలో కాగడా పెట్టి వెతికినా కార్యకర్తలు కనిపించరు. కేడర్ లేని పార్టీకి నేతలు బోలెడంత మంది. అందరూ ఎవరి మటుకు వారు మీడియా సమావేశాలు పెట్టి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేస్తారు. అయితే జనం పట్టించుకోవడం లేదన్న బాధ వారిని వెంటాడుతోంది.
బీజేపీ ఆత్మకూరులో పోటీ చేయడానికి అధికార పక్షానికి ఆ ఉప ఎన్నికలో చుక్కలు చూపడానికే అని ఎంతగా చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు సరికదా.. వైసీపీ కోరింది కనుకే పోటీ బీజేపీ అక్కడ పోటీలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా ఒకే సమయంలో ఇటు జనసేనతోనూ, అటు వైసీపీతోనూ మైత్రి కొనసాగిస్తూ ప్రజలలోనే కాదు.. ఆ పార్టీని అభిమానించే ఒకరిద్దరిలో కూడా చులకన అయిపోతున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకుల ప్రసంగాలూ, ఎంపీ జీవీఎల్ లాంటి వారి ఆవేశపూరిత ప్రసంగాలూ జనానికి మంచి వినోదాన్ని పంచుతున్నాయి.
అయితే ఇప్పుడు ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు నడ్డా ఏపీకి వస్తున్నారు. ఆయన మాటలు కూడా ఇక్కడి జనం పట్టించుకోకపోతే.. జాతీయ స్థాయిలో పార్టీ పరువు పోతుందన్న భయం బీజేపీని వెంటాడుతోంది. ఇప్పటి దాకా బీజేపీ అధికార పార్టీపై, జగన్ ప్రభుత్వంమై విమర్శలు చేస్తూ వచ్చింది కానీ, వైసీపీ నుంచి కానీ, జగన్ సర్కార్ లోని మంత్రుల నుంచీ కానీ చిన్న పాటి ఖండన కూడా రాలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కాస్త ఆలస్యంగానైన సరే గమనించింది.
ఇఫ్పుడు నడ్డా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో తమ విమర్శలకు ప్రభుత్వం నుంచి చిన్న పాటి ఆయన స్పందనైనా రావాలని, ప్రతి విమర్శ ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే తలుపు చెక్కతో నేను.. తమల పాకుతో నువ్వు అంటూ ప్రభుత్వాన్ని, వైసీపీని బతిమలాడుకుంటోంది. తాజాగా విష్ణు వర్థన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలలో పదును పెంచుతూ మీడియా ముందుకు రావడానికి కారణమదే. కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తానన్నట్లుగా జగన్ మాట్లాడటాన్ని డ్రామాగా అభివర్ణిస్తూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
హస్తిన వెళ్లి కేంద్రం పెద్దలతో భేటీల వివరాలు వెల్లడించకుండా డ్రామాను రక్తికట్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శిస్తూ జగన్ దంతా పోలిటికల్ మైండ్ గేమ్ గా అభివర్ణించారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని పలుచన చేయడానికి జగన్ కుట్ర చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి మాటలతో ఒక్క సారిగా వైసీపీ నుంచి బీజేపీవై విమర్శల వర్షం కురుస్తుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఇప్పటికే వైసీపీకి బీజేపీకి కేంద్ర స్థాయిో మంచి సపోర్ట్ ఉందని రాష్ట్ర స్థాయిలో పార్టీని నడుపుతున్న వారంతా జగన్ భజనలోనో, సేవలోనే తరిస్తున్నవారేనని జనం భావిస్తున్నారు.
పరిశీలకులు కూడా తమ విశ్లేషణల్లో అదే చెబుతున్నారు. జనసేనాని తన ఆప్షన్లతో బీజేపీకి దాదాపు ఒక అల్టిమేటమ్ ఇచ్చేశారనే పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకుల ఏపీ పర్యటనలో వైసీపీ తమ రాజకీయ ప్రత్యర్థి అంటూ ప్రసంగాలు చేసి జనాలను నమ్మించగలరా? నవ్వుల పాలౌతారా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కూడా అదే సందేహం తొలిచేస్తున్నది.దీంతో సోము వీర్రాజు వంటి స్థానిక నాయకులతో లాభం లేదని విష్ణువర్ధన్ రెడ్డి, జేవీఎల్ వంటి వారు రంగంలోకి దిగి వైసీపీపై విమర్శల దాడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
జనసేనతో పొత్తు కొనసాగుతుందనీ, ఆ పార్టీతో కలిసి రాష్ట్రంలో అధికారం చేపడతామని చెప్పుకుని నమ్మించడానికి నానా తంటాలూ పడుతున్నారు. అయితే బీజేపీ, వైసీపీ రహస్య పొత్తుపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం వైసీపీది అధికారం, బీజేపీది పెత్తనంలా సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామంటూ బీజేపీ ఉడుత ఊపులు ఎవరిని బెదరించడానికి, ఎవరిని నమ్మించడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు, జనం ఎగతాళి చేస్తున్నారు.


