రాష్ట్రపతి ఎన్నికల్లో ఎదురీత తప్పదా?
Published on: Sat Jan 8, 2022 7:09PM
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరూ ఉహించలేరు. అన్ని సందర్భాలలో కాకపోయినా కొన్ని సందర్భాలలో అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఉహకందని పరిణామాలు, ఇటును అటూ అటును ఇటూ చేసేస్తాయి. రాష్ట్రపతి రామనాథ్ కొవింద్ ఎన్నిక సమయంలో బీజేపీకి భయం లేదు. పూర్తి భరోసాతో బరిలో దిగింది. అదే విధంగా, అంతవరకు దేశానికీ అంతగా పరిచయం లేని రామనాథ్ కొవింద్ దేశ ప్రధమ పౌరుడుగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. అయితే, ఇప్పుడు, ఈ సంవత్సరం (2022) జూలైలో ఆయన పదవీ కాలం ముగుస్తోంది.ఈ నేపధ్యంలో కొత్త అధ్యక్షుని ఎన్నిక జరగ వలసి వుంది. అయితే, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీజేపీలో అప్పుడున్న భరోసా ఇప్పుడు ఉందా, అంటే లేదు. నిజానికి బీజేపీ భయపడుతోందని రాజకీయ విశ్లేషకులే కాదు, బీజేపీ నాయకులూ కూడా అంగీకరిస్తున్నారు.
నిజానికి, రాష్ట్రపతి ఎన్నిక ఒక్కటే కాదు, అంతకంటే ముందే ఖాళీ అవుతున్న 75 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలు కూడా కమల దళాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇందులో ప్రస్తుతం 26 సీట్లు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. తిరిగి ఈ 26 స్థానాలను రాబట్టుకోవడంతో పాటుగా అదనంగా అన్నో ఇన్నో స్థానాలు తమ ఖాతాలో కలుపుకోవడం ఎలా, అనేది ఇప్పుడు బీజేపీ నాయకుల ముందున్న మేజర్ సవాల్’గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పెద్దల సభలో స్థానం దక్కాలంటే ఆయా రాష్ట్రాల శాసన సభలో ఎమ్మెల్యేల సఖ్యాబలమే కీలకం అవుతుంది. ఈవిషయమలో బీజేపీ జాతీయ పార్టీల కంటే ప్రాతీయ పార్టీల నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటోందని అంటున్నారు.
దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలలో తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు చాలా స్పష్టంగా బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నాయి. బీజేపీ ప్రాబల్యాన్ని పడగొట్టేందుకు ఏ చిన్నఅవకాశాన్ని, ఈ పార్టీలు వదులు కోవు. మరో వంక ఇంతవరకు ఎంతోకొంత మేర బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు కూడా మెల్లమెల్లగా దూమవుతున్నాయి. మరో వంక వచ్చే రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ముఖ్యంగా మొత్తం 75 లో 11 రాజ్యసభ స్థానాలు ఖాళీ వుతున్న యూపీలో ప్రాంతీయ పార్టీలు గట్టి పట్టు మీదున్నాయి. రేపటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలుపుకున్నా, ప్రస్తుతమున్న 11 రాజ్యసభ స్థానాలను నిలుపుకోవడం అయ్యేపని కాదని అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 300లకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ. ఈ సారి ఆ స్థాయి విజయం సాధ్యం కాదు. సో .. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిన మేరకు రాష్ట్రం నుంచి పెద్దల సభకు వెళ్ళే కాషాయ సభ్యుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఒక్క ఉత్తర ప్రదేశ్’లోనే కాదు, పంజాబ్ (7), మహారాష్ట్ర (6), తమిళ నాడు (6) లలో కూడా బీజేపీ గెలుపు అవకాశాలు లేవు. ఈ రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. సో.. ఈ 19 రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా బీజేపీకి దక్కదు. అలాగే ఏపీలో నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు సీట్లు కూడా అధికార వైసీపీ గెలుచుకుంటుంది.
సో లోక్ సభలో బీజేపీ కి పూర్తి మెజారిటీ ఉన్నా, రాజ్య సభలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రేపు రాదు. కాబట్టి, బీజేపీ ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకునే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. అందుకే, అటు ఏపీలో ఇటు తెలంగాణలో అలాగే, అటూ ఇటూ కాకుండా ఉన్న ఇతర రాష్ట్రాలలో బీజేపీ, పెద్దగా దూకుడు చూపలేక పోతోందని పరిశీలకులు అంటున్నారు. మరోవంక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో, పెద్దల సభలో విపక్షాలు ప్రవర్తించిన తీరు గమనిస్తే, తెరాస, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీలు రాజ్య సభలోనే కాదు, రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీకి మద్దతు ఇవ్వకపోవచ్చని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, అందుకు మరో నాలుగైదు నెలల సమయం వుంది ఈలోగా ఏమైనా జరగవచ్చని... ఈరోజుకు అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురీత తప్పదనే రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


