ఏపీలో బీజేపీ అడుగులు.. త్వరలోనే పెద్ద పెద్ద నిర్ణయాలు

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడుతున్నామ‌ని బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ముర‌ళీధ‌ర్ రావు ఇంట్లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న ప్ర‌ధాని మోడీ రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని, దానికి సంబంధించిన ఏర్పాట్లు, పార్టీ కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించామ‌న్నారు. దీంతోపాటు, రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ప్ర‌త్యేకంగా మాట్లాడామ‌న్నారు.

దేశ‌మంతా బీజేపీ ఒక ఊపు ఊపితే.. ఏపీలో అస్స‌లు దాని ప్ర‌భావం క‌నిపించ‌లేద‌న్నారు. ఏపీలో మోడీ వేవ్ ని బీజేపీ మిస్స‌యింద‌న్నారు. అయితే, ఆ వేవ్ ని త్వ‌ర‌లో ఏపీ చూస్తుంద‌నీ, దేశవ్యాప్తంగా బీజేపీకి ఊపు వ‌చ్చిన‌ట్టుగానే ఇక్క‌డా రాబోతోంద‌న్నారు. బీజేపీ ఒక ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల‌నేది ల‌క్ష్య‌మ‌న్నారు. ఏపీకి సంబంధించి త్వ‌ర‌లోనే పెద్ద‌పెద్ద నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను చేర్చుకున్నంత మాత్రాన పార్టీ బ‌లోపేతం కాద‌నీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎంత పెద్ద నాయకుడు వ‌చ్చి చేర‌తామ‌న్నా ఆయ‌న‌కు సంబంధించి అన్ని విష‌యాల‌పై ఎంక్వ‌యిరీ చేసుకున్నాక‌, పార్టీలో పెద్ద స్థాయిలో చ‌ర్చ జ‌రిగాక‌నే చేరిక‌లు ఉంటాయ‌ని జీవీఎల్ అంటున్నారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేర‌తార‌నే వార్త‌ల‌పై స్పందిస్తూ, తాము ఎవ్వ‌రినీ చేర్చుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చేయట్లేదని, స‌భ్య‌త్వాన్ని పెంచుకోవ‌డంపై మాత్ర‌మే త‌మ దృష్టి ఉంద‌న్నారు.