జగనే సీఎం..రాజు గారు ఏమన్నా చెప్పారా... !

 

బీజేపీ-టీడీపీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డివేస్తేనే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రపక్షంగా ఉన్నప్పుడే రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం జరుగుతూ ఉండేది. ఇక ప్రత్యేక హోదా నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయి వార్ ప్రకటించేశారు. మోడీని టార్గెట్ చేస్తూ... ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఈ మాటల యుద్దం ఇంకా తారాస్థాయికి చేరింది అని చెప్పొచ్చు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్లయితే రెచ్చిపోయి మరీ మాట్లాడేస్తుంటారు. ఇక ఈ రెండు పార్టీలు విడిపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ-బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని.. అందుకే జగన్ చంద్రబాబును విమర్సిస్తున్నారే తప్పా.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోడీని మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తూనే ఉన్నారు. అంతేకాదు కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరైనా బీజేపీతో పొత్తు కోసం జగన్ చూస్తున్నాడన్న విషయం ఇట్టే అర్దమైపోతుంది.

 

ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తున్నట్టు ఉన్నాయి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు..  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న ఈయన మీడియాతో మాట్లాడుతూ... ఎప్పటిలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని ఆయన అన్నారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... హైదరాబాదులో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి, అక్కడి నుంచి పారిపోయి వచ్చి, విజయవాడలో మకాం పెట్టారని విష్ణు అన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటు వేయవద్దని కర్ణాటకలోని తెలుగువారికి ఆయన పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పిలుపు ఇవ్వాలనుకుంటే ఆయన చుట్టాలకు ఇచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని... త్వరలోనే అవినీతిని బయటపెడతామని చెప్పారు. అంతేనా అక్కడితో ఆగకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయ సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. మరి సీఎం కావాలని ఎంతో ఆశగా ఉన్న జగన్ కనుక రాజు గారి మాటలు వింటే ఫుల్ కుషీ అవుతారేమో.. మరి ఏకంగా వైసీపీ నే గెలుస్తుందని... చెప్పి.. వైసీపీ-టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...