బీజేపీ ఎత్తుతో జనసేనకు భారీ నష్టం!!

తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా.. బీజేపీతో పొత్తుతో భవిష్యత్ లో ఎప్పటికైనా అధికారం చేపట్టవచ్చని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి.. బీజేపీ ఎత్తుతో ఊహించని షాక్ తగిలే అవకాశముందనిపిస్తోంది. ఏపీలో కొద్ది రోజులుగా బీజేపీ వ్యవహారశైలిని చూస్తే.. కాపు పార్టీగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఉన్నారు. సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి.. కాపు వర్గాన్ని పార్టీకి దగ్గర చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతల్ని పోటీలో చేర్చుకోగా, ఇప్పుడు మరికొంతమందిని చేర్చుకుని వారికి కీలకమైన పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన పార్టీలో చేరితే కాపు వర్గం మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. అందులో భాగంగానే సోము వీర్రాజు స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి మరీ ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీలో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ముద్రగడతో పాటు మరికొందరు కాపు నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే కాపు సామాజిక వర్గానికి దగ్గరవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం జనసేనకు భారీ నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నప్పటికీ.. మొత్తంగా దాదాపు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అందులో మెజారిటీ ఓట్లు.. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే వచ్చాయి. దీనినిబట్టే అర్థంచేసుకోవచ్చు.. ఎంతో కొంత కాపు ఓటు బ్యాంక్ జనసేన పక్షాన ఉందని. అయితే, ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని ఆ ఓటు బ్యాంకుకు కూడా గండి పడే అవకాశముంది. అసలే బీజేపీతో దోస్తీ మూలంగా జనసేన తన సొంత స్వరాన్ని బలంగా వినిపించలేకపోతుంది. దానికితోడు ఏవైనా ఉపఎన్నికలు వచ్చినా బీజేపీ జనసేనకి పోటీ చేసే అవకాశం ఇచ్చేలా కనిపించడంలేదు. మరి ఈ పరిస్థితుల్లో కాపు సామజిక వర్గానికి దగ్గరవ్వాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం.. జనసేనను మరింత దెబ్బకొట్టే అవకాశముంది. మరి జనసేనాని ఇప్పటికైనా మేలుకుంటారో లేదో అని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.