ప్రజల్ని భయపెడితే ఎలా ప్రభూ ?!
Published on: Tue Jun 7, 2022 11:22AM
భయపెట్టడం, లొంగదీసుకోవడం ఎక్కువగా సినిమాల్లో, అక్కడక్కడ బయటా గమనిస్తుంటాము. పచ్చి విరోధులను ఆ విధంగా భయపెట్టడం, హెచ్చరించడం లేదా దాడులు చేయడం విన్నాం. కానీ ఏలికలే భయపెట్ట డం అనేది బహుశా మోడీ గారి పాలనలోనే జరుగుతోంది.
పాలకుడు ప్రజల్ని అన్ని విధాల రక్షించేవాడిగా, సంక్షేమపథకాలు చక్కగా అమలుచేస్తూ అందరి ఆద రాభిమానాలు పొందాలి. కానీ అందుకు విరుద్ధంగానూ పాలకులు తమ వీరాభిమానులతో దాదాపు గూండా గిరీ చేస్తానంటే ఎలా? ఇది ప్రజాస్వామ్యం. ఒక వున్నత స్థాయిలో వున్నవాడు పార్టీలకు అతీ తంగా అందరినీ సమ దృష్టితో చూడాలి,
సమ న్యాయం అమలు చేయాలి. తప్ప తన పార్టీ తరఫున దేశాన్ని పాలిస్తున్నట్టుగానే అనుకుంటే ఎలా? పెద్ద పెద్ద ఉపన్యాసాలు, సూక్తులు హిందీలో, ఇంగ్లీషులో వినిపి స్తూనే తమకు కాస్తంత ఎదురు తిరిగిన వారిని నోరుమూసుకోమని గదమాయించడం, ఆనక ప్రతి పక్షాల వారిపై దాడులతో భయ భ్రాంతులు చేయడం సమంజసమా? బిజెపి వారి పాలన అదే స్థితిలో వుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ఇందులో ఇసుమంత తప్పు లేదు.
ఏ రాష్ట్రంలో చూసినా బిజెపి వాక్చాతుర్యం, గోలతో పాటు, భయపెట్టడం లేకుంటే దాడులు చేయించడం ద్వారా తమ మాట చెల్లుబడి అయేట్టు చేసుకోవడం పరిపాటిగా మారింది. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్.. ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి వారి బెదిరింపులు, హెచ్చరికలూ పెరిగిపోతున్నాయి. తమ పార్టీ లేదా తమ ప్రభుత్వం ఎంతో గొప్పగా పనిచేస్తుందని, వారి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేయ డం వేరు.
మావే గొప్పవి, గత ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమీ లేదు, మేము చెప్పిందే వేదం, మాట వినితీరాలి అంటూ మాటల యుద్ధంతో మీద పడిపోతుండటం జరుగుతోంది. తమ విధానాలను ఎవరూ అడ్డుకోవడానికి వీలులేదని, తాము అనుసరిస్తున్న మార్గమే గొప్ప శాంతి మార్గమని అంటూనే సామాజిక, మత పరమయిన విద్వేషాలకు తెరలేపి ఆనందించడం బిజెపి వారికే సాధ్యం. ఇది ఈ మధ్య మరీ పెచ్చు మీరుతోంది. అవతలి వారి వివరణలు వినడం, గోడు పట్టించుకోవడం గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి బాగా తగ్గింది. అది కేవలం వినికిడి లోపం కాదు, వినక్కర్లేదన్న దుష్ట భావన! ఇది మహా ప్రమాదం.
అసలు పాలకులు ఎందుకు బెదిరించడం, హెచ్చరించడం, దాడులను, ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లో బిజెపి వర్గీయుల వ్యవహార శైలి బొత్తిగా అన్యాయంగా మారిందనేది సర్వత్రా వినవస్తోంది. కేంద్రం రాష్ట్రాలకు ఎంతో మేలే చేస్తోందని, గతంలో కంటే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగయ్యాయని స్వయంగా బిజెపీ నాయకులే చెబుతున్నారు.
అది రాష్ట్రాల సీఎంలు, విపక్షాలవారు, ఇతర అధికారులు అనాల్సిన మాట. కానీ బయటకు అననీయకుండా పరిస్థితు లు మారిపోతున్నాయి. ఏ రాష్ట్రంలోనూ ప్రజలు కేంద్ర విధానాలు, పథకాల అమలు గురించీ గొప్పగా చెబు తున్న దాఖలాలు లేవు. అఖండ భారత్, వికాస్ భారత్ అంటూ హిందీలో గట్టిగా అరిచి చెబుతు న్నంత మాత్రాన అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయనా? ప్రతి రాష్ట్రమూ కేంద్రం నుంచి సరయిన మద్దతు లే దనే అంటోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్‌తో ప్రత్యేకించి ఒరిగిందేమీ లేదు. ఇస్తా నన్నవేవీ ఇవ్వలేదు. చీటికీ మాటికీ దబాయించడం మాత్రం బాగా జరుగుతోంది. ఇక్కడి బిజెపి నాయకు లకు, ఎంపీలుగా వున్న తెలుగు నాయకులకు ఇక్కడి పరిస్థితులు తెలిసినా వారు సభల్లో గట్టిగా కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే దేవర వారిని కోరుకోవాలేగాని, సభలో నిలదీయడం అసంభవం. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం, పథకాల అమల్లో మద్దతు, విభ జన హామీలు నెరవేర్చడం వీటిలో ఏవీ సరిగా జరగనే లేదు. అది ఇక్కడి బిజెపి ఎంపీలకీ తెలుసు. కానీ వారు రాష్ట్ర సరిహద్దులు దాటగానే మునులుగా మారిపోతున్నారు.
సీఎంలకు, రాష్ట్ర అధికారులకు కేంద్రంలో ఎవరినీ అనుకున్న తడవునే కలిసే వీలుండదు. కలిసి గట్టిగా అడగడమూ వీరికి చేత రావడం లేదు. ఇది కేంద్రంలో వున్నవారికి మరీ అలుసుగానూ మారింది. కేవలం సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగా యి అని ప్రచారం చేసుకోవడం, చేయించుకోవడం తప్ప వారి నుంచి వచ్చి న సమాధానం మరోటి వుండ డం లేదు. అది బిజెపి చిన్న నాయకులకు కూడా మంచి అవకాశాల్ని ఇస్తోంది. అనేక చర్చల వేదికల మీద ఆగ్రహిస్తూ ఇక్కడి ప్రభుత్వానిది, అధికారులదే తప్పు అని మాటల దాడికి పూనుకంటున్నారు. బిజేపీ వారి దేవర భక్తి, దేశభక్తి, మతాభిమానం ముందు మిగతావన్నీ దిగ దుడుపే. వారికి ప్రజల సంక్షేమం, పథకాల అమలు విషయాల్లో ప్రజలకు ఏ మేరకు మేలు జరుగుతోందన్నది అప్రధానం. కేంద్రాన్ని, మోదీని ఎవరు ఏమన్నా అస్సలు సహించరు. ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు, అధికారులు.. ఎవరయినా కేవలం విని వూరుకోవలే గాని, ప్రశ్నించకూడదు. అది సరయినదయినా సరే. ప్రశ్నిస్తే కేంద్రంలో వారికి కోపం వస్తుంది అది దేశంలోని అన్ని భాషల్లోకి ట్రాన్స్‌లేట్ అయి ఆయా ప్రాంతాల్లోని వీర బిజెపి జవాను లు దాడులకు ఎగబడతారు. దీన్ని పాలనాపరమయిన కంట్రోలింగ్ అనాలా, భయపెట్టడం అనాలా? ఇక్కడ వకాల్తా పుచ్చుకుని మాట్లాడే బిజెపి నాయకులే నిదానించి సమాధానం చెప్పాలి. తాము చేసింది తప్పు పట్టడం అంగీకారయోగ్యం కాదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.
తాము చేసిందే రైటు అనుకో వడం అదే ప్రచారం చేయడం, ప్రజల మీద రుద్దడం సబబా. మత విద్వేషాలు రెచ్చగొట్టడం గొప్ప సూ త్రంగా, వారికి అననుకూల సమయాల్లో చేపడుతున్న కార్యక్రమం. నిన్నటికి నిన్న బిజెపి అధికార ప్రతి నిధి నూపుర్ ప్రాఫెట్ మహమ్మద్ మీద తీవ్రవ్యాఖ్యలు చేయడం దాని మీద పెద్ద దుమారం లేవడం అందరం వింటున్నాం, చూస్తున్నాం. కానీ చిత్రంగా కేంద్రం మాత్రం అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కొట్టిపారేసింది!! ఆమెను పార్టీనుంచి బహిష్కరించి చేతులు దులిపేసుకుంటే చాలదనీ, దీనికి కేంద్రం తగిన సమాధానం ఇవ్వ డంతో పాటు దేశానికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని విపక్షాలు, ముస్లిం వర్గాలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. చిన్న చిన్నవాటికి రెచ్చిపోయే సదరు బిజెపీ హేమాహేమీలకు మరి నూపుర్ బుద్ధిహీనత ప్రమాదకరంగా తోచడం లేదా? లేక తమ పార్టీ మనిషి గనుక అది చిన్న అంశంగానే చూస్తున్నారా? ఇప్పుడు ఎవరు క్షమాపణలు చెప్పాలి. నోరు పారేసుకోవడంలో ప్రముఖంగా కనపడుతున్నవారంతా, పార్టీకి, నాయకునికి వకాల్తా పుచ్చుకుని ప్రతీ విషయంలో అరిచి మరీ తమ అభిప్రాయాల్ని జనాలమీద రుద్దుతున్నవారంతా మౌనంగా వుండడం ఎంతవరకూ సమంజసం?


