తెదెపాతో బీజేపీ బంధం ముగిసిపోయిందా?
Published on: Mon Feb 15, 2016 11:40AM
.jpg)
గ్రేటర్ ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాలను బీజేపీ ఇంకా జీర్ణించుకోనట్లుంది. త్వరలో జరగబోయే వరంగల్ నగర కార్పొరేషన్ ఎన్నికలకు సొంతంగానే పోటీ చేద్దామంటూ ఆ పార్టీ నాయకులు దిల్లీ పెద్దలకు కబురు పంపుతున్నారట. అంతేకాదు! వరంగల్ నగర పరిధిలోకి వచ్చే 58 డివిజన్లకు అభ్యర్ధులను కూడా ఖరారు చేసేసినట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికలలో తెదెపా వల్ల తమకు నష్టమే కానీ లాభం కలగలేదని స్థానిక నేతలు భావించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలలో 63 వార్డులలో పోటీ చేసిన భాజపాకు 4 స్థానాలు దక్కగా, మిగతా 87 స్థానాలలో పోటీకి దిగిన తెదెపా కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. సీట్ల సర్దుబాటులో భాగంగా, తాము గెలిచే అవకాశాలు ఉన్న చోట్లను కూడా తెదెపా లాక్కొందని బీజేపీ ప్రధాన ఆరోపణ. మిగిలిన చోట్ల కూడా తెదెపా తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించలేదని, ఓటమి తరువాత ఒకరినొకరు ఓదార్చుకున్నారు బీజేపీ పెద్దలు. ఈ సందర్భంగా కలిసి ఉంటే ఎలాగూ విజయాలు దక్కడం లేదు కాబట్టి, వేర్వేరు కుంపట్లతోనే బరిలోకి దిగుదామని వారు తెదెపాకు సంకేతాలు పంపుతున్నారట. ఫలితాలు కలిసి వస్తే కూటమిగానే వరంగల్ మేయర్ పీఠాన్ని దక్కించుకుందామని చెప్పకనే చెబుతున్నారట. ఈ స్నేహపూర్వక శత్రుత్వం ఎక్కడి వరకూ వెళ్తుందో, ఏ ఎన్నికలను ఎలా నడిపిస్తుందో చూడాలి మరి!


