వైసీపీని టార్గెట్ చేయడానికి బీజేపీ కి ఇంకా టైం ఉందట !

 

దక్షిణాది మీద ద్రుష్టి పెట్టిన బీజేపీ ఇప్పటికే కర్ణాటకలో రచ్చ రేపింది. ఇక మరోపక్క గోవాలో పదిమంది ఎమ్మెల్యేలను లాక్కుని కాంగ్రెస్ శాసనసభా పక్షం లేకుండా చేసేసింది. ఇక తెలంగాణా మీద కూడా అమిత్ షా ఫోకస్ చేసి టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీలో జగన్ చెప్పిన మాట వింటున్నారు కాబట్టి ఆయనకు ఇబ్బంది లేదని అంతా భావించారు. అయితే జమిలీ పేరుతో కొంత టార్గెట్ చేసినా అది అవుతుందో లేదో తెలీదు. సో ఇక ఆయన సేఫ్ అనుకున్నారు, కానీ అదంతా ఒట్టిదే అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. వైసీపీనీ వదిలిపెట్టేది లేదు దానికి టైముంది అంతేనని ఆ పార్టీ  ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొనడం సంచలనంగా మారింది. 

ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఈరోజు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నని వీర్రాజు కలిసిన సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కాసేపు సరదా సంభాషణ చోటు చేసుకుంది. తొలుత వెంకన్న మాట్లాడుతూ ‘అన్నా...ఇన్నాళ్లు టీడీపీని టార్గెట్ చేశారు. ఇక అది ఆపి వైసీపీ సంగతి చూడండని కోరగా ఆయన స్పందిస్తూ వైసీపీని కూడా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.  ఆయన ఒక్కడే అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఆ పార్టీ నేత మరొకరు కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ పలు ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపధ్యంలో మాట్లాడిన మాణిక్యాలరావు జన్మభూమి కమిటీల వలనే టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు జగన్‌ వలంటీర్ల పేరుతో అదే వ్యవస్థను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ విధానమే భవిష్యత్తులో జగన్ ఓటమికి కారణం అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు విధానాలనే సీఎం జగన్‌ కూడా అనుసరిస్తున్నారని జగన్ కూడా ఇబ్బందులు పడడం ఖాయమని చెప్పుకొచ్చారు.