2019లో షా బెంగాల్‌ని కొడితే… మోదీకి ఏ బెంగా లేనట్టే!

ఇప్పుడు దేశంలో మోదీ తరువాత అందరి దృష్టి ఆకర్షించేది అమిత్ షానే! మనకు ఉప ప్రధాని ప్రస్తుతం లేకపోవచ్చుగానీ… అమిత్ షా హడావిడి డిప్యూటీ పీఎం రేంజ్లోనే వుంది! ఆయన కేవలం రాజ్యసభ సభ్యుడు, అధికార పక్షం జాతీయ అధ్యక్షుడు. కానీ, ఏ రాష్ట్రానికి షా వచ్చినా కోలాహలం మామూలుగా వుండటం లేదు. మోదీ ప్రధాని హోదాలో వస్తే ఎంత జాగ్రత్తగా వుంటారో… ఆయా రాష్ట్రాల నేతలు, పోలీసులు… అమిత్ షాకు అదే స్థాయిలో ప్రాముఖ్యతనిస్తున్నారు. పొగిడేవారు పొగిడినా, తిట్టే వారు తిట్టినా ఇప్పుడు అమిత్ షాను మాత్రం పట్టించుకోకుండా వుండే స్థితి లేదు. అలా ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలోకి బీజేపీ యాగాశ్వాన్ని ముందుండి నడిపిస్తున్నారు షా!

 

 

అమిత్ షా తన చాణక్యంతో గోవా మొదలు త్రిపుర దాకా కాషాయ కమలాన్ని వికసింపజేయటం మెచ్చుకోదగ్గదే అయినా ఆయన ఎంచుకుంటున్న మార్గాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్టీ విస్తరణ కోసం షా ఎంతకైనా దిగజారతారని తిట్టిపోస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ నేతలు తమ నేతని విపరీతంగా పొగిడేస్తూ మురిసిపోతున్నారు. ఇక బీజేపీకి రెబెల్స్ గా వుంటోన్న యశ్వంత్ సిన్హా, అరూణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా లాంటి వారు కూడా షా మీద గుర్రుగానే వున్నారు. ఎందుకంటే, మోదీ అసలు బలమంతా అమిత్ షానే కాబట్టి…

 

 

జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ మొదలు యూపీలో మాయవతి వరకూ చాలా మంది తిరుగులేని నాయకురాళ్లని అమిత్ షా ముప్పతిప్పలు పెడుతున్నారు. అతి పెద్ద పార్టీగా బీజేపికి వున్న వెసులుబాటు, కేంద్రంలో అధికారం తమ చేతిలో వుండటం వంటి అనుకూల అంశాల కారణంగా ఆయన ఆడింది ఆటగా నడుస్తోంది. అయితే, కేవలం బెంగాలీ దీదీ మమత మాత్రం టఫ్ ఫైట్ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ, షాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న అతి కొద్ది మందిలో ఆమె ఒకరు!

 

మమతా బెనర్జీ తరువాత ప్రాంతీయ నేతల్లో ఆమెలా కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తున్నది మన చంద్రబాబు లాంటి బాగా అనుభవం వున్న వారు మాత్రమే! మోదీ, షా కుట్రల్ని అర్థం చేసుకుని పావులు కదపటం సీబీఎన్ లాంటి వారికైతేనే చెల్లుతుంది. జగన్, పవన్, కేసీఆర్ లాగా చాలా రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధినేతలు అయిష్టాంగానైనా బీజేపీతో వివాదాలకి దూరంగా వుంటున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్, ఒడిషాలో నవీన్ పట్నాయక్, బీహార్లో నితీష్, తమిళనాడులో పళని, పన్నీర్ సెల్వం… వీళ్లంతా కమలానికి అవసరమైనప్పుడు సాయం చేయటం ఇష్టపూర్వకంగా కాదని ఎవరైనా చెప్పేయగలరు! దేశం మొత్తంలో తమని మొండిగా ఎదుర్కొంటోన్న శక్తుల్లో మమతా బెనర్జీపై తీవ్రంగా దృష్టి సారించారు మోదీ, అమిత్ షా. కారణం ఆమె రాష్ట్రంలో బీజేపీకి కాస్త అనుకూల వాతావరణం వుండటమే.

గత సంవత్సర కాలంలో అయిదుసార్లు బెంగాల్ లో పర్యటించిన అమిత్ షా అక్కడి స్థానిక నేతలకి పెద్ద టార్గెట్టే ముందు పెట్టారు. 42 ఎంపీ సీట్లలో మనకు 22 తప్పకుండా రావాలని అంటున్నారట. తాజాగా ఇవాళ్ల కూడా యువ సమ్మేళనం అనే పేర భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అందులో ప్రసంగించేందుకు కోల్ కతా చేరుకున్నారు షా. అసోమ్ లో వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర రిజిస్టర్ బెంగాల్లో కూడా అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు హామీ ఇవ్వచ్చంటున్నారు. అదే జరిగితే మమత మరింత ఆగ్రహంతో ఊగిపోవచ్చు. ఎందుకంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ పౌరులు చాలా మంది ఆమె పార్టీకి ఓటు బ్యాంక్ గా మారారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అంతే కాదు, ముస్లిమ్ ఓటర్లలో తన ఇమేజ్ పెంచుకునే వ్యూహంతో కూడా మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర దాడి చేస్తున్నారు. ఎన్ఆర్సీ వ్యవహారాన్ని సుప్రీమ్ కోర్టు పర్యవేక్షిస్తున్నా మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేస్తూ కమలదళం మైనార్టీల్ని టార్గెట్ చేస్తోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఆమె తన పుట్టలో వేలు పెడుతున్న కాషాయదళంపై అసహనంతోనే చేస్తున్నారు…

 

 

మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక బెంగాల్ కమ్యూనిస్టులు చాలా బలహీనమయ్యారు. వాళ్లు కనుచూపు మేరలో తిరిగి అధికారం చేపట్టే సూచనలు కనిపించటం లేదు. జనం కూడా దశాబ్దాల తరబడి వారికి అధికారం కట్టబెట్టి నిరాశకి లోనయ్యారు. అందుకే, బెంగాల్ లో తృణమూల్ అంటే గిట్టని వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు. కొన్ని వర్గాల ఓటర్లు, అనేక మంది నేతలు ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో దీదీని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు. ఇలాంటి అనుకూల వాతావరణం కారణంగానే అమిత్ షా బెంగాల్ సీఎంతో ప్రత్యక్ష యుద్ధానికి సై అంటున్నారు. ఆయన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే తనని అరెస్ట్ చేసినా కోల్ కతా వచ్చి తీరుతానని హెచ్చరించి పర్మిషన్ సంపాదించుకున్నారు. ఇంతలా అమిత్ షా టార్గెట్ చేసిన రాష్ట్రం మరేదీ లేదనే చెప్పాలి… మమతని బెంగాల్లో దెబ్బతీయటం ద్వారా కేవలం స్థానికంగానే కాదు… బీజేపీకి జాతీయంగా కూడా లాభం వుంది. మోదీకి ధీటైన ప్రధాని అభ్యర్థిగా ఇప్పుడు ఎవరూ లేరు. రాహుల్ అంటూ ప్రచారం జరుగుతున్నా ఆయన ఇంకా చాలా దూరం పరుగెత్తాల్సి వుంది.

ఇక రాహుల్ తరువాత మోదీ, షా తమకు ప్రమాదకరంగా భావిస్తోంది మమతా బెనర్జీనే! అందుకే, ఆమెను ఆమె స్వంత రాష్ట్రంలోనే తక్కువ ఎంపీ సీట్లకు పరిమితం చేసి దిల్లీలో విలువ తగ్గించాలని వ్యూహం పన్నారు. ఒకవేళ అమిత్ షా ప్రయత్నాలు ఫలించి మమతా బెనర్జీ ఇరవై మంది ఎంపీలకే పరిమితం అయితే… అది ప్రతిపక్షానికి పెద్ద దెబ్బే! కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్ని ఏకతాటి పైకి తేగల నాయకత్వం దాదాపుగా ఇంకెవరి వద్ద వుండదు.అప్పుడు 2019లోనూ అనివార్యంగా సాధ్యమైనన్నీ ఎక్కువ పార్టీలు మోదీ నాయకత్వంలో పని చేయటానికి సిద్ధపడతాయి. ఇంత ఎఫెక్ట్ వుంటుంది కాబట్టే మమతా బెనర్జీ కోటలో కత్తి దూయటానికి షా సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు!