Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో పాగాకు..ఏపీలో బాబుతో మైత్రి.. బీజేపీ కొత్త స్కెచ్!
posted on: Aug 8, 2022 10:50AM
తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కి చెక్ పెట్టి.. అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో బాబును మోడీ స్వయంగా పలకరించి, ఆప్యాయంగా మాట్లాడారా? శత్రువుకు శ్రుతువు మిత్రుడు అనే లాజిక్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంత్రాంగం నెరపేందుకు .. కమలం పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారా? అంటే.. రాజకీయ విశ్లేషకులు నుంచి అందుకు అవుననే సమాధానం వస్తోంది.
తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రదాని మోడీయే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించడమే కాకుండా పక్కకు తీసుకువెళ్లి కొద్ది సేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇది సమావేశానికి హాజరైన ప్రముఖులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిణామం విస్తృత చర్చకు తెర తీసింది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత.. వీరిద్దరు ఎదురుపడటం ఇదే ప్రథమం. ఉప్పు నిప్పులా ఉండే ఇరువురూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం.. ప్రత్యేకంగా ముచ్చటించుకోవడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార ఫ్యాన్ పార్టీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అందుకు నిరసనగా చంద్రబాబు ఓ రోజు దీక్ష చేసి.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షాతో భేటీకి ప్రయత్నించారు. కానీ అప్పట్లో చంద్రబాబుకు ఇరువురూ కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రెండు రోజులు వేచి చూసి .. ఆ తర్వాత వెనుదిరిగారు. ఆ తరువాత కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా.. మోడీ, అమిత్ షాలను కలిసే ప్రయత్నం చేయలేదు.. అలాగే వారు కూడా చంద్రబాబును అంతగా పట్టించుకోనూ లేదు. కానీ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం మద్దతు ప్రకటించడంతో కమలనాధుల మనస్సును చంద్రబాబు మరోసారి గెలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఆ అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రంలో నేరుగా బీజేపీ రాజకీయాలు చేయడానికి అట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గత టీడీపీ నాయకులంతా కారు పార్టీలో చేరి.. సీఎం కేసీఆర్‌కి కోటరీగా మారిపోయారు. కానీ తెలంగాణలో సైకిల్ పార్టీ కేడర్ మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా.. కేసీపీ సిమెంట్‌తో కట్టిన నిర్మాణంలాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఆ క్యాడర్ బలంపైనే బీజేపీ ఆశలు పెంచుకుంటోంది. ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ బీజేపీకి అండగా నిలిచేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తెలుగుదేశం క్యాడర్ అండతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి ఉంటే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా కొన్ని జిల్లాలలో తెలుగుదేశం బలం తమకు తోడ్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో కీసీఆర్ అధికారానికి వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టాలంటే చంద్రబాబు అండ అవసరమని బీజేపీ గుర్తించిందని అంటున్నారు.నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుతో మోడీ తనంత తానుగా మాట కలపడాన్ని చూస్తుంటే తెలంగాణలో పాగాకు స్కెచ్ లో భాగమేనని విశ్లేషిస్తున్నారు.






