టార్గెట్ టీఆర్ఎస్.. తెలంగాణలో అధికారం .. బీజేపీ వ్యూహత్మక అడుగులు
Published on: Thu Jun 2, 2022 11:10AM
తెలంగాణలో అధికారం చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో అడుగులేస్తున్న బీజేపీ.. తన చతురంగ బలాలతో రాష్ట్రాన్ని కమ్మేయడానికి వ్యూహ రచన చేసింది. తెలంగాణలో అధాకారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో తెలంగాణలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రానికి అప్పలు తీసుకోవడానికి అనమతి ఇవ్వకపోవడం ద్వారా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చర్యలు తీసుకున్న బీజేపీ ఇక రాజకీయంగా టీఆర్ఎస్ ను ముఖ్యంగా కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టి ఫ్రస్ట్రేషన్ కు గురి చేయడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో పర్యటించారు. అధికార టీఆర్ఎస్ అవినీతిపైనా, ముఖ్యమంత్రి కేటీఆర్ కుటుంబ పాలనపైనా విమర్శలు గుప్పించారు.
ఇప్పుడిక ఏకంగా దాదాపు కేంద్ర కేబినెట్ అంతా మూడు రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేసే విధంగా వ్యూహరచన చేసింది బీజేపీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా తెలంగాణకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నది చెప్పకనే చెప్పారు కమల నాథులు. వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. వీరంతా మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా రాజకీయ చక్రం తిప్పడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు బదులుగానా అన్నట్లు బీజేపీ మొత్తం తన చతురంగ బలాలనూ తెలంగాణలో మోహరించి జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయించుకుంది.
దీంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూడక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. హైదరాబాద్ హెటెక్స్ వేదికగా జులైలో మూడు రోజుల పాటు జరిగే ప్లీనరీలో తెరాస అవినీతి, కేసీఆర్ కుటుంబ పాలనపై నేతల ప్రసంగాలు ఉంటాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడం, ప్రభుత్వంపై యాంటీ ఇన్ కంబెన్సీ ప్రభావం తీవ్రంగా ఉండటంతో.. బీజేపీ వ్యూహాత్మకంగా తెలంగాణను కమ్మేస్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం ద్వారా దేశం మొత్తం రాష్ట్రంవైపు చూసే పరిస్థితి కల్పించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి తెలంగాణ సెంటిమెంట్ విషయంలో టీఆర్ఎస్ కంటే రెండడుగులు ముందే ఉన్నామని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేసింది. అదే సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హామీ ఇచ్చి కూడా తెరాస అధినేత కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశనిస్తూనే, రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి కేసీఆర్ ను ఢిఫెన్స్ లో పడేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సంకెళ్లలో బంధించేసింది. దీంతో సకాలంలో జీతాలు చెల్లించలేక కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కల్పించింది.
తద్వారా ధనిక రాష్ట్రాన్ని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కుప్పలుగా మార్చేశారని సర్వత్రా విమర్శలు చెలరేగేందుకు అవకాశం కల్పించింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీని దెబ్బకొట్టాలని ఒకరి రెండు నెలల్లో సంచలనం నమోదు చేస్తానని కేసీఆర్ చెబుతున్నారు. ఆ సంచలనం అయితే ఏమిటో ఇప్పటి వరకూ తెలియదు కానీ, బీజేపీ మాత్రం తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ నిర్ణయం ద్వారా దేశం చూపు మొత్తం రాష్ట్రంపైకి మళ్లేలా చేయగలిగింది. ఈ క్రమంలో కేసీఆర్ వచ్చే నెలకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో బీజేపీకి కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.


