‘మోదీ సర్కార్-2’ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి!

బీజేపీ ప్రస్తుత కెప్టెన్ అమిత్ షా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశారు. ఇది పెద్ద వార్తగా నిలవలేదు తెలుగు మీడియాలో. కానీ, షా ఎందుకని ధోనిని కలిశారు? ఈ ప్రశ్నకి జవాబు చాలా ఆసక్తికరం! మరీ ముఖ్యంగా, 2019 లోక్ సభ ఫైట్ కి రెడీ అవుతోన్న టీమ్ మోదీకి ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ తో చాలా అవసరమే వుంది!

 

 

ధోనిని అమిత్ షా ఊరికే కలవలేదు. సంపర్క్ సే సమర్థన్ అనే ఆలోచనతో అమలవుతోన్న వరుస భేటీల కార్యక్రమంలో భాగంగా కలిశారు. ఇదే మీటింగ్ లలో భాగంగా భారత ఆర్మీ మాజీ చీఫ్ ని, మాధురీ దీక్షిత్, రతన్ టాటా వంటి వార్ని కూడా కలిశారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు రామోజీ రావుని కలిసింది కూడా అందుకే. వ్యాపారం, క్రీడలు, సినిమా… ఇలా అన్ని రంగాల వాళ్లని కలవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యకమైన పాతిక మంది భారతీయ ప్రముఖుల్ని షా కలుస్తారు. వారికి మోదీ సర్కార్ విజయాల్ని వివరిస్తారు. తద్వారా దేశంలో వచ్చిన మార్పులు, జనాల జీవితాల్లో జరిగిన చేర్పులు అర్థమయయ్యేలా చెబుతారు. షా లాగే బీజేపీలోని నాలుగు వేల మంది పార్టీ నేతలు తమ తమ పరిధిలో ప్రముఖుల్ని కలుస్తారట. ఇలా దాదాపు లక్ష మంది ఫేమస్ ఇండియన్స్ ని బీజేపీ టార్గెట్ చేసింది. వారికి తమ సక్సెస్ ఎక్స్ ప్లెయిన్ చేయటం ద్వారా సామాన్యుల దాకా సమర్థంగా వెళ్లాలని కోరుకుంటోంది!

 

 

మన దేశంలో ఇంత కాలం దాదాపుగా కాంగ్రెస్ మార్కు రాజకీయాలే నడిచాయి. దిల్లీ పాలకులు, కాంగ్రెస్ పార్టీ అధినేతలంటే రారాజుల్లా వెలిగిపోయే వారు. ఇప్పటికీ, యాభై ఏళ్లకి దగ్గరగా వచ్చేస్తోన్న  రాహుల్ గాంధీని మన మీడియా యువరాజు అనటానికే ఇష్టపడుతుంది! ఇది తరతరాల రాజకీయ వారసత్వం ఎఫెక్ట్! మరోవైపు మోదీ, షా కొత్త తరం పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వారిద్దరూ తమదైన స్టైల్లో గుజరాతీ బిజినెస్ మైండ్ ప్రదర్శిస్తున్నారు! ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి రిలీజ్ కి సిద్ధంగా వున్న సినిమా కోసం ఆ యూనిట్ సభ్యులు ఎలా ప్రమోషన్స్ లో పాల్గొంటారో…. అలా తమ ‘మోదీ సర్కార్ టూ-2019’ సినిమా కోసం పార్టీ నేతలంతా రంగంలోకి దిగారు!

 

 

ఈ విషయం ఎంత వరకూ రాహుల్ గాంధీ గ్రహించారో గానీ ఇప్పటికైతే కాంగ్రెస్ తరుఫు నుంచీ ఎలాంటి ఎత్తుగడలు లేవు. ఒకప్పటి లాగే సినిమా, క్రీడా, వ్యాపార సెలబ్రిటీలు అంటే… తమని వచ్చి కలవాల్సిందే అనుకుంటూ కాలు మీద కాలేసుకుని కూర్చున్నట్టు కనిపిస్తోంది హస్తం వ్యూహం కర్తలు! బీజేపీ సుప్రీమ్ బాస్ తనంత తానే సెలబ్రిటీల ఇంటికి వెళ్లి తమ విజయగాథల్ని మార్కెట్ చేసుకోవటం ఖచ్చితంగా ఇతర పార్టీలు గుర్తించాల్సిన వ్యూహం. కాంగ్రెస్ తో పాటూ ప్రాంతీయ పార్టీలు కూడా మారుతోన్న గేమ్ ని అర్థం చేసుకోవాలి. రూల్స్ మారిపోతున్నాయని గ్రహించాలి. ఇప్పుడు ప్రముఖులకి పార్టీల కంటే పార్టీలకి ప్రముఖులు ముఖ్యమైపోయారు! సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు ఒక్కమాట చెబితే చాలా ఓట్లే పడతాయి. చాలా సీట్లపైనే ప్రభావం వుంటుంది. దీన్ని ముందుగానే గ్రహించారు అమిత్ షా. అందుకే కాళ్లకు బలపం కట్టుకుని ప్రముఖుల ఇళ్లకు తిరుగుతూ ఇగోను పక్కన ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్షాలు తొందరగా గుర్తించకపోతే నష్టం ఎంతో కొంత తప్పకపోవచ్చు. కారణం… షా తమని కలిసిన వీఐపీలంతా వచ్చే ఎన్నికల్లో కమలానికి మద్దతు పలకకపోవచ్చు. అయినా వారితో కలిసి షా భేటీ అవ్వటమే జనాల్లోకి పాజిటివ్ సిగ్నల్స్ పంపేస్తుంది. గత ఎన్నికల్లో రజినీకాంత్ ఇంటికి మోదీనే స్వయంగా తమిళ స్టైల్లో పంచె కట్టి వెళ్లారు! ఎందుకంటే, ఇందుకే! రజిని బహిరంగ మద్దతు పలకకపోయినా ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ మెసేజ్ వెళ్లిపోయింది!

 

 

పాలిటిక్స్ లో సెలబ్రిటీలు స్వంతంగా ఎదగటం చాలా కష్టం. కానీ, వారి ప్రభావం ఓటర్లపై చాలా ఎక్కువ. ఇందుకు మంచి ఉదాహరణ మన అన్నగారు ఎన్టీఆరే! ఆయనకు ఇందిరా గాంధీ తప్పుడు లెక్కలు వేసుకుని రాజ్యసభ టికెట్ ఇవ్వలేదంటారు! అందులో నిజం వుందో లేదో గానీ ఆయన తెలుగు దేశం స్థాపించటం నేడు ఏపీలో కాంగ్రెస్ సున్నా స్థానాలు మిగలటానికి నాంది! అందుకే, ఇండియాలో సెలబ్రిటీ శక్తిని తక్కువగా అంచనా వేయటానికి అస్సలు వీల్లేదు. మరి ఈ సత్యాన్ని గ్రహించి అప్పుడే మార్కెటింగ్ మొదలు పెట్టిన బీజేపీని ఇతర పార్టీలు ఎలా ఢీకొంటాయో? చూడాలి…