జమిలిపై బిజేపీ పట్టు

 

జమిలి ఎన్నికలపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్టుదలగా ఉంది. 2019 వ సంవత్సరంలో లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యం. ఈ జమిలి ఎన్నికలతో తాము లాభపడాలన్నది బీజేపీ నాయకుల పన్నాగం. జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాలకు ఎలాంటి మేలు జరగదన్నది వివిధ రాష్ట్రాల్లోని పాంత్రీయ పార్టీలకు చెందిన నాయకులు వాదన. ఇందులో కొంత నిజం ఉంది. ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి వస్తే ఒకటి రాష్ట్రంలో ఒకరికి... కేంద్రంలో మరొకరికి వేస్తారని ప్రాంతీయ పార్టీలకు చెందిన వారి భావన. ఇదే జరిగితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారు ఎవరన్నది ప్రాంతీయ పార్టీల బలాబలాను బట్టి ఉండేది. జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి అవకాశమూ ఉండదు. జాతీయ పార్టీలది ఇష్టారాజ్యంగా ఉంటుంది. ఈ కారణంగా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జి, ఇటీవలే మరణించిన కరుణానిధి, దేవెగౌడ వంటి వారు వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ససేమిరా అన్నారు.
అయితే, కేంద్రం మాత్రం దీనిపై పట్టుదలగా వ్యవహరిస్తోంది.

 

 

ఈ సారి లోక్‌సభకు జరగాల్సిన ఎన్నికలను అన్ని శాసనసభా ఎన్నికలతో కలిపి నిర్వహించాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల యోచన. ఈ ఆలోచనను ఎలాగైనా అడ్డుకోవాలని. జమిలి ఎన్నికలు జరగనివ్వరాదని కొందరు నాయకులు పట్టుదలగా ఉన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వారి నుంచే వ్యతిరేకత వచ్చేలా చేయాలన్నది ప్రాంతీయ పార్టీల నాయకుల ఉద్దేశ్యం. ఈ ఎత్తులను గమనించిన కేంద్రం వీరి ఎత్తులకు పైఎత్తుగా జమిలి ఎన్నికలకు  ఏకంగా చట్టబద్దత కల్పించాలని చూస్తోంది. దీనికి చట్టబద్దత కల్పిస్తే ఇక రాష్ట్రాలు ఏమీ చేయలేవన్నది కేంద్రం యోచన. ఇందుకోసం లా కమిషన్ తన పని ప్రారంభించింది. జమిలి ఎన్నికలకు సాధాసాధ్యలను బేరీజు వేస్తోందిజ ఈ నెల 31 నాటికి లా కమిషన్ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా జమిలిపై ఓ నివేదిక తయారు చేసి ఇచ్చే పనిలో పడ్డారు లా కమిషన్ సభ్యులు. వారి పని పూర్తి అయిన వెంటనే కేంద్రం వచ్చే లోక్‌సభ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు తీసుకువచ్చి దీన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన. ఇదే జరిగితే ఈసారి లోక్‌సభతో పాటు 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసారికి ఇలా కానిచ్చినా..... 2024 ఎన్నికలను మాత్రం జమిలిగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. దీనిపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా దీన్ని ఎదుర్కొవాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. ఈ వ్యూహంతో ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి యుద్ధమైనా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. జమిలిపై ఆయన వేసిన పాచిక పారుతుందో... లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే...!!!