శ్రీవాణి ట్రస్ట్ సాక్షిగా గంగలో కలిసిన బీజేపీ పరువు
Published on: Sat Jul 1, 2023 10:04AM
శ్రీవాణి ట్రస్ట్ విషయంలో బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీశాయి. బీజేపీ, వైసీపీల మధ్య ఇంత కాలం రహస్యం అనుకుంటున్న మైత్రిని బహిర్గతం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రశీదు కూడా ఇవ్వడం లేదని డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయంటూ విపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. దానితో రంగంలోకి దిగిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి.. శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకవకలు జరగలేదని ప్రకటించి విమర్శలకున, ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రకటనపై ప్రజలలో విశ్వసనీయత లేదని వారికి వారే భావించుకుని పలువురు మఠాథిపతులు, ప్రముఖులతో కూడా ప్రకటనలు ఇప్పించారు. శ్రీవాణి ట్రస్టు లెక్కలు తాము పరిశీలించామని, అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వారంతా మూకుమ్మడిగా తేల్చేశారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ లెక్కల తనిఖీకి ఎంపిక చేసిన కొంత మందినే అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని పార్టీలకూ.. లెక్కలు తనిఖీ చేసే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే దానిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీ కూడా శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు గుప్పించింది. రశీదు ఎందుకివ్వడం లేదంటూ ప్రశ్నించింది. శ్రీవాణి ట్రస్టు లెక్కలపై, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆ తరువాత పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకువేసి ట్రస్టు లెక్కలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, వారి ఆరోపణలు ఖండించడం, టీటీడీ కూడా శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటనలివ్వడం జరిగింది. ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఆరోపణలను, శరవేగంగా ఖండించే మంత్రులు.. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన ఆరోపణలను మాత్రం ఖండించలేదు. అయితే
ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ కు క్లీన్ చిట్ ఇస్తూ మీడియా ముందుకు రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. సాధారణంగా విపక్షాలు ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎండగట్టేందుకే ప్రాధాన్యం ఇస్తాయి. అలాంటి అవకాశం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తాయి. అలాంటి అవకాశం వస్తే ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి వెనుకాడవు. కానీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని భానురెడ్డి చేసిన ప్రకటన, రాజకీయంగా బీజేపీని సంకట ఇబ్బందుల్లో పడేసింది.
ఇప్పటికే జగన్ సర్కార్ కు బీజేపీ అన్ని విధాలుగా అండదండగా నిలుస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ పై భానుప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి. వైసీసీ, బీజేపీ అంటకాగుతున్నాయన్న అనుమానాలకు మరింత బలోపేతం చేశాయి. హిందుత్వం- హిందూ ఆలయాలపై దాడుల విషయంలో గళం విప్పే బీజేపీ నేతలే.. ఈ విధంగా శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ టీటీడీకి వకాల్తా పుచ్చుకోవడంపై పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగడం లే దన్నది భానురెడ్డి వాదన. ఆ మేరకు తాను ఈఓ కార్యాలయానికి వెళ్లి పరిశీలించానని, అక్కడ అవకతవకలు జరిగినట్లు తనకు కనిపించలేదని స్పష్టం చేశారు. అనవసరమైత ఆరోపణలు చేయవద్దని ఆయన కోరడం, బీజేపీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
శ్రీవాణి ట్రస్టు లెక్కలు తనిఖీ చేయమని, పార్టీ నాయకత్వం ఏమైనా భానురెడ్డిని అధికారికంగా పంపిందా? పంపితే ఆ మేరకు అనుమతి కోరుతూ ఈఓకు ఏమైనా లేఖ రాసిందా? రాస్తే ఆ లేఖ రాసింది ఎవరు? అలాగైతే అన్ని పార్టీలకూ లెక్కల తనిఖీలకు అనుమతి ఇస్తారా? లేక బీజేపీకి మాత్రమే అది పరిమితమా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఓవైపు మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీవాణి ట్రస్టులో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తే, తాము మాత్రం అలాంటిదేమీ లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారంటే .. అది పవన్‌ను అవమానించడమే కదా? అని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ అడిగిన ప్రశ్నలకు తమ వద్ద జవాబు లేదని బీజేపీ సీనియర్లు వాపోతున్నారు.
‘‘శ్రీవాణి ట్రస్టులో అవకతవకలు లేవన్న భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన సొంతవా? పార్టీ స్టాండా? దీనిపై సోము వీర్రాజు స్పందించకపోతే, ఇవి సోము వీర్రాజు అనుమతితో చేసిన వ్యాఖ్యలుగానే భావిస్తామని’’ కిరణ్ స్పష్టం చేశారు. దీనితో జనసేనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, బీజేపీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
పైగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన లెక్కల్లో.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి- బీజేపీ నేత భానురెడ్డి చేసిన ప్రకటనల మధ్య పొంతన లేకపోగా, 300 కోట్లు తేడా కనిపించడం మరో వివాదానికి తెరలేపినట్లయింది. ట్రస్టుకు 800 కోట్ల నిధులు వచ్చాయని చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ బీజేపీ నేత భానురెడ్డి మాత్రం 1100 కోట్లు వచ్చాయని వెల్లడించడమే ఆ గందరగోళానికి కారణం. ట్రస్టు లెక్కలను సమర్ధించిన భానురెడ్డి చెప్పినట్లు.. మిగిలిన ఆ 300 కోట్ల రూపాయలు ఏమయ్యాయని జనసేన ఇన్చార్జి కిరణ్‌రాయల్ డిమాండ్ చేశారు.
ఈ ఈ అంశంలో ఆయన భానుప్రకాష్‌రెడ్డిపై విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. ‘అసలు టీటీడీ తరఫున మాట్లాడేందుకు భానురెడ్డి ఎవరు? ఆయనేమైనా చైర్మన్ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి అధికార ప్రతినిధా? టీటీడీ ఈఓ మమ్మల్ని కూడా భానురెడ్డి మాదిరిగానే అనుమతించి, లెక్కలు చూపాలి. అధికారులు భానురెడ్డికి ఏం చూపించారో, ఆయనేం చూశారో మేము కూడా పరిశీలిస్తాం. పవన్ కల్యాణ్ పెదవి విప్పిన తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్ధం కావడం లేదు. హిందుత్వం, గుళ్లపై ఎక్కువగా మాట్లాడే బీజేపీ, శ్రీవాణి అవకతవలను సమర్థించిన భానురెడ్డిపై చర్యలు తీసుకోవాలి’’ అని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
కాగా భానురెడ్డి వ్యవహారశైలి.. మొత్తం పార్టీని ఇరికించడంతో, పార్టీ వర్గాలు సంకటస్థితిలో ఉన్నాయి. ప్రధానంగా ఇది అధ్యక్షుడు సోము వీర్రాజుకు, ప్రాణసంకటంలా పరిణమించింది. వీర్రాజు అనుమతి లేనిదే భానురెడ్డి ఎందుకు మాట్లాడతారని అటు జనేసైనికులు ప్రశ్నిస్తుంటే.. ఇలాంటి సున్నిత అంశంపై మాట్లాడేందుకు వీర్రాజు పార్టీ నేత భానురెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘ఇది రెండు పార్టీలకు సంబంధించిన సున్నిత అంశం. పైగా జనసేన ఇంకా మాతో పొత్తులోనే ఉంది. రెండురోజుల క్రితమే మా అధ్యక్షుడు, తాము జనసేనతో మాత్రమే కలసి పోటీ చేస్తామని మీడియాకు చెప్పారు. అలాంటిది శ్రీవాణి ట్రస్టుపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారని తెలిసి కూడా భానురెడ్డి, ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా టీటీడీని సమర్థించడం పొత్తు ధర్మం కాదు. ఇది చాలా దూరం వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. అందువల్ల భానురెడ్డిపై చర్యలు తీసుకుంటేనే, ఈ సమస్య ఇక్కడితో ముగుస్తుంది. లేకపోతే పవన్ అభిప్రాయాలను ఖండించిన మేం, ఆయనతో ఎలా మనస్ఫూర్తిగా నడవగలం’ అని తూర్పు గోదావరికి చెందిన ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.
భాను వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు వీర్రాజు, స్వయంగా వివరణ ఇస్తే స్పష్టత వస్తుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా పవన్ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడిన భాను ప్రకటన, యూట్యూబ్ లింక్, ఆంగ్ల మీడియాలో వచ్చిన క్లిప్పింగులను ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీకి పంపినట్లు సమాచారం.


