కంచి స్వామిని ప్రభుత్వం అకారణంగా వేధించింది- అమిత్‌ షా

తమిళనాట ఎన్నికలు ముంచుకురావడంతో అక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కంచి స్వామివారి జన్మదినానికి హాజరైనా అమిత్‌ షా కూడా ఓ వివాదాస్పద వ్యాఖ్యను చేశారు. శంకరరామన్‌ హత్య కేసులో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిని అన్యాయంగా ఇరికించారనీ ఆయన ప్రకటించారు. జయేంద్ర సరస్వతి 80వ జన్మదినోత్సవం సందర్భంగా చైన్నైలో జరిగిన ఓ సమావేశానికి అమిత్‌ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేంద్ర సరస్వతిని అమిత్‌ కొనియాడారు. గుజరాత్‌లో మత విద్వేషాలని చల్లార్చేందుకు, జయేంద్ర చాలా కృషి చేశారని ప్రశంసించారు.

ఆ పర్యటనలో అనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కూడా జయేంద్రతో కలిసి నడిచారని గుర్తుచేసుకున్నారు. జయేంద్రను ఒక కేసులో అన్యాయంగా ఇరికించారని తెలియగానే, తాను గుజరాత్‌లో ధర్నా కూడా చేశానని చెప్పుకొచ్చారు. జయేంద్రను అరెస్టు చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని ఇప్పుడు అమిత్‌ షా వెల్లడించడంలో ఆంతర్యం ఏమటో! విజయ్‌కాంత్‌ నెలకొల్పిన డీఎండీకే పార్టీ కూడా ఇప్పుడు బీజేపీతో కలవకపోవడంతో, ఈసారి తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అమిత్‌ వ్యాఖ్యలు ఓటర్లను ఎంతో కొంత ప్రభావితం చేయకపోవు. దీనికి తగినట్లుగానే జయేంద్ర సరస్వతి కూడా ‘మోడీ చాలా మంచి వ్యక్తి’ అంటూ కొనియాడారు.