TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ 20లోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక

Published on: Thu Apr 17, 2025 10:03AM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనున్నది. అదే విధంగా ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం కూడా నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో బుధవారం (ఏప్రిల్ 16)న కీలక సమావేశం జరిగింది.

సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ప్రకటనపై చర్చించారు. ఈ నెల 20వ తేదీలోగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ఆ లోపే ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెబుతున్నారు.  

వాస్తవానికి ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. నింబంధనలకు వ్యతిరేకంగా  ప్రస్తుతం   జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోడు పదవులలో కొనసాగుతున్నారు. ఇది పార్టీ నిబంధనలకు వ్యతిరేకం. అయినా కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయం తేల్చలేక పార్టీ హైకమాండ్ ఆయననే కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (ఏప్రిల్ 18) నుంచి మూడు రోజుల పాటు బెంగళూరులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక, ప్రకటన ఉంటుందని అంటున్నారు. అందు కోసమే బుధవారం (ఏప్రిల్ 16)న అత్యవసరంగా ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో నిర్మలా సీతారామన్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సారి దక్షిణాది నుంచే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.