TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రాముడి ఇండియాలో  93, రావణుడి లంకలో  51! పెట్రోల్ రేటుపై  బీజేపీ ఎంపీ సెటైర్లు  

Published on: Tue Feb 2, 2021 11:40AM

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే చుక్క‌ల‌నంటుతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఇప్పటికే ప్రీమియం బ్రాండ్ పెట్రోల్ రేట్ వంద రూపాయలు దాటేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పెట్రోల్ , డీజిల్ రేట్లు సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నారు. తాజాగా కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో.. పెట్రోల్ రెండున్న ర రూపాయలు, డీజిల్ పై 4 రూపాయలు అదనంగా అగ్రి ఇన్ ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో దేశంలో చమురు ధరలకు ఆకాశామే హద్దు అయ్యేలా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ స్పీడులో పెరిగి పోతుండటంతో  నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలు వస్తాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 

ఏ విషయంలోనైనా త‌న అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తాజాగా చ‌మురు ధ‌ర‌ల‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం భార‌త్, నేపాల్, శ్రీ‌లంక‌లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చుతూ అయన ట్వీట్ చేశారు. "రామ్ ఇండియాలో పెట్రోల్ ధర 93రూపాయ‌లు.. సీత నేపాల్‌లో 53రూపాయ‌లు.. ఇక రావణుని లంకలో 51రూపాయ‌లు" అంటూ సుబ్ర‌మ‌ణ్య‌ స్వామి ఒక ఫోటో కూడా జత చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లోక్‌సభలో 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన మర్నాడే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు కేంద్ర సర్కార్ మాత్రం  బడ్జెట్‌లో అగ్రి సెస్, డెవలప్‌మెంట్ సెస్ విధించినా.. చమురు ధరలు పెరిగే అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చింది.