పిజ్జా, బర్గర్లు లాగిస్తూ.. డబ్బుల కోసం రైతుల ఆందోళన: బీజేపీ ఎంపీ సంచలనం 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 50 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రోడ్ల మీదే ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం పై నిన్న సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉండగా రైతుల ఆందోళనలపై రాజకీయ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఎస్ మునిస్వామి రైతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులు ఆందోళనలు చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నారని అయన ఆరోపించారు.

కర్నాటకలోని కోలార్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ మునిస్వామి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు అసలు రైతులు కాదని.. వారంతా నకిలీ రైతులని, దళారులని, వారు పిజ్జా, బర్గర్‌లను తింటున్నారని, అక్కడ జిమ్ ను కూడా తయారు చేశారని అయన ఆరోపించారు. వారంతా చేస్తున్న ఈ డ్రామాను ఇంతటితో ముగించాలని అయన అన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలోని వివిధ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మరో బీజేపీ ఎంపీ మదన్ దిలావర్ ఆందోళన చేస్తున్న రైతులపై కామెంట్స్ చేస్తూ.. రైతులు చికెన్ బిరియానీ తింటూ దేశంలో బర్డ్‌ఫ్లూను వ్యాపింపజేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.