శ్రీరాముడు మా ముత్తాత.. ఇదిగో సాక్ష్యం: బీజేపీ ఎంపీ

 

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న అయోధ్య వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అక్కడ ఒకప్పుడు రామ మందిరం ఉండేది అని, అయోధ్య శ్రీరాముడు జన్మస్థలం అని హిందుత్వ వాదులు వాదిస్తున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం హిందుత్వ సంస్థలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. మరోవైపు అయోధ్యలో మసీదు కోసం ముస్లింలు కూడా పోరాడుతున్నారు. మతాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో.. సుప్రీం కోర్టు ఎవరికీ సర్ది చెప్పలేక కేసుని సంవత్సరాలుగా పొడిగిస్తూ వస్తుంది. అయితే తాజాగా.. రాముడు జన్మస్థలం అయోధ్య అని చెప్పడానికి ఆధారాలు ఏవైనా ఉన్నాయా?, రాముని వార‌సులు, ర‌ఘువంశానికి చెందిన వారెవ‌రైనా ఉన్నారా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ర‌ఘువంశ వార‌సులు ఇంకా ఉన్నారా? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించిందో లేదో.. వారి ప్ర‌శ్న‌కు వెంటనే స‌మాధానం ల‌భించింది. జైపూర్ రాజ‌వంశానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి నేనున్నాను అంటూ ముందుకు వ‌చ్చారు. తాము రాముడి కుమారుడు కుశుడు వంశానికి చెందిన వారమని, శ్రీరాముడు తమకి ముత్తాత అవుతారని చెప్పుకొచ్చారు. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను అన్నారు. రాముడి వంశస్థులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నారని, అయోధ్య వివాదం వీలైనంత త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు.

చారిత్ర‌క ఆధారాల ప్ర‌కారం.. రామాయ‌ణం త్రేతాయుగంలో.. అంటే దాదాపు 10 వేల ఏళ్ల‌ క్రితం జ‌రిగింది. ఇన్నేళ్ల త‌రువాత రాముని వార‌సుల‌ను గుర్తించేందుకు ఎలాంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు? ఏ ప‌ద్ధ‌తిని అవలంభిస్తారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దియా కుమారి ర‌ఘువంశ వార‌సురాలు అన్న విష‌యం ఎలా రుజువు చేసుకోగ‌లుగుతుంద‌న్న ప్ర‌శ్న కూడా ఉత్కంఠ‌ను రేపుతోంది. మరోవైపు తాము కూడా శ్రీరాముడి వంశస్తులమేనని మేవార్ ఉదయ్ పూర్ రాచకుటుంబ సభ్యుడు మహేంద్రసింగ్ కూడా ముందుకొచ్చారు. రాముడి వంశస్తులెవరైనా ఉన్నారా? అని సుప్రీంకోర్టు అడిగిన విషయాన్ని తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు కోరితే అన్ని ఆధారాలను, డాక్యుమెంట్లను అందిస్తామని మహేంద్రసింగ్ తెలిపారు. మరి ఇది ఇంత‌టితో ఆగుతుందా? లేక త‌మ‌ది కూడా ర‌ఘువంశ‌మేన‌ని మ‌రికొంత మంది ముందుకు వ‌స్తారా? అన్న‌ది వేచి చూడాలి.