నేను ఓడిపోతే ప్రజలకే నష్టం - బీజేపీ ఎమ్మెల్యే

 

కొన్ని రోజుల క్రితం ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తెలియదు అనే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన బీజేపీకి దూరం అవుతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆయన ఈ వార్తలకు చెక్ పెట్టారు. అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘‘కొంతమంది నేతలు పార్టీ మారినంత మాత్రాన మా పార్టీ ఖాళీకాదు. 40 లక్షల మంది సభ్యులున్నారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారు.’’ అని విష్ణుకుమార్‌ రాజు స్పష్టం చేశారు.

అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘బీజేపీ అంటే జగన్‌, పవన్‌ అని విమర్శించిన టీడీపీ... ఇప్పుడు పవన్‌ను తీసేసి కేసీఆర్‌ను చేర్చింది. టీడీపీ నేతలు పవన్‌ ని విమర్శించడం మానేశారు. దీంతో పవన్‌ గాలి కూడా కాస్త మారినట్లు కనిపిస్తోంది. మోడీ చేతుల్లో పవన్‌ ఉన్నాడని చెప్పిన టీడీపీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. ట్విస్ట్‌లు, యూటర్న్‌లకు టీడీపీ పెట్టింది పేరు. కేంద్రం ఇవ్వడంలేదని కడప ఉక్కు, రామయపట్నం పోర్టులకు శంఖుస్థాపనలు చేసిన సీఎం చంద్రబాబు కేంద్రం రైల్వేజోన్‌ ప్రకటించలేదని సొంతంగా ప్రకటిస్తారేమో? అని ఎద్దేవా చేశారు.

ఏపీలో ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్లు పెంచారు. రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలు బయట పెట్టింది నేనే. నా పేరు చెబితే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తి గట్టిగా పోరాటం చేశా. నాలాంటి నిజాయతీపరుడైన ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత నా నియోజకవర్గ ప్రజలపై ఉంది. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా. నాకేమీ నష్టంలేదు. ప్రజలకే నష్టం’’ అని విష్ణుకుమార్‌ రాజు చెప్పుకొచ్చారు.