జిన్నా టవర్‌పై బీజేపీ మార్క్ పాలిటిక్స్.. ఇన్నాళ్లకి గుర్తొచ్చిందా నాయనా?
Published on: Thu Dec 30, 2021 3:42PM
జిన్నా టవర్. గుంటూరులో ల్యాండ్ మార్క్. దేశానికి స్వాతంత్య్రం రాకముందునుంచే అదక్కడ ఉంది. ఇప్పటికీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫేమస్ పాయింట్. జిన్నా టవర్ అనే పేరే గాని.. ఇంతకీ ఆ 'జిన్నా' ఎవరో.. ఆయన ఎక్కడి వారో.. గుంటూరువాసులకు అంతగా తెలీక పోవచ్చు. పిలవడమే గానీ.. ఆ పేరు గురించి వారెప్పుడూ అంతగా పట్టించుకున్నది లేదు. కానీ, ఇన్నాళ్లకి ఏపీ బీజేపీ నేతలు జిన్నా పేరును పట్టించుకున్నారు. అదేంటి? పాకిస్తాన్‌కు చెందిన జిన్నా పేరును.. ఆ దేశ ద్రోహి పేరును.. మన గుంటూరులో పెట్టడమేంటి? అంటూ ఇవాళే నిద్ర లేచారు ఏపీ కమలనాథులు.
ఉదయానే బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ జిన్నా టవర్‌పై వివాదం రాజేశారు. జిన్నా పేరు తొలగించి.. అబ్దుల్ కలాం పేరునో.. గుర్రం జాషువా పేరునో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనకు వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలు వంతపాడారు. గంటల గ్యాప్‌లోనే ఈ విషయం తెలుసుకొని.. పక్క రాష్ట్రం తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వారి టోన్‌కు మరింత బేస్ యాడ్ చేశారు. జిన్నా పేరు తీసేస్తారా.. లేక, ఏకంగా టవర్‌నే కూల్చేయమంటారా? అంటూ రాజాసింగ్ తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఇలా.. జిన్నా టవర్‌పై బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తూనే ఉన్నారు.
బీజేపీ నేతల తీరు చూసి.. గుంటూరువాసులు విసుక్కుంటున్నారు. మాకు లేని అభ్యంతరం.. మీకెందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం అనే తేడా లేకుండా గుంటూరులో కలిసుంటున్నామని.. ఇప్పుడు మీరొచ్చి.. జిన్నా పేరుతో రాజకీయం చేసి.. అనవసర ఉద్రిక్తతలను రెచ్చగొట్టొద్దని మండిపడుతున్నారు. విజయవాడలో సోము వీర్రాజు వారు వల్లించిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరిగిందని.. ఆ టాపిక్ నుంచి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే.. ఇలా గుంటూరు జిన్నా టవర్ పేరును ఇష్యూగా మారుస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
.webp)


