కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే ఆయన వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నట్టే

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొడాలి నానిని బర్తరఫ్ చెయ్యాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

 

విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం, నూతలపాటి బాల, వంగవీటి నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. కొడాలి నాని, రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. యోగిల గురించి నాని వంటి భోగిలు మాట్లాడుతారా అని విమర్శించారు.

 

రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లు.. ప్రభుత్వానికి 'అయ్యా.. ఎస్' అనవద్దని సూచించారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అదే చర్చిపై రాళ్లు వేస్తే 41 మందిని అరెస్టు చేశారని, అమరావతిలో మహిళలపై కేసులు పెట్టి అరెస్ట్‌లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నానిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేదే తమ డిమాండ్ అన్నారు. హిందూ సమాజం ఓపిక ఉన్నంత వరకే... ఆ తర్వాత ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న మంత్రులు క్యాబినెట్ లో ఉండకూడదని డిమాండ్ చేశారు. జగన్ చర్యలు తీసుకోకపోతే.. నాని చేత ఆయనే ఇలా మాట్లాడిస్తున్నది‌ వాస్తవం అవుతుందని విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. మరి, జగన్ ఈ వివాదంపై స్పందిస్తారో లేక ఇలాగే మౌనంగా ఉంటూ నాని వ్యాఖ్యల వెనుక తాను ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇస్తారో చూడాలి.

 

మరోవైపు, గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ కార్యకర్తలు కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. హిందూ దేవాలయాలపైనా, ప్రధాని పైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.