జనసైనికులా మజాకా.. రెడ్డిగారు ఇరుకున పడ్డారు!!

 

ప్రస్తుతం మనం జనాలకి పెద్దగా తెలియదు కదా అని నోటికి ఏదొస్తే అది వాగకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలి అనుకునేవారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొందరు.. అబ్బే, ఇప్పుడు మనం పెద్దగా ఎవ్వరికి తెలీదు కదా అని రెచ్చిపోయి.. వారి కులపోళ్ళని పొగుడుతూ ఓ నాలుగు ట్వీట్లు.. మిగతా వ్యక్తుల్ని, మిగతా కులాల్ని నీచంగా కించపరుస్తూ మరో నాలుగు ట్వీట్లు చేస్తారు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో ఉంటారు. ఎవరైనా.. అయ్యా అప్పట్లో మీరు ఇలా వాగారంటూ సాక్ష్యాలతో సహా బయటపడితే.. దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థంగాక ఆకులు పట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఇదే.

 

 

ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు ఉద్యమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ కి పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కి టీడీపీ, బీజేపీ మద్దతు కూడా కోరారు. పవన్ తలపెట్టిన ఈ మార్చ్ కి ఇరు పార్టీల అధినేతలు సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడం.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు నచ్చలేదంట. ఇంకేముంది పవన్ తలపెట్టిన ఆందోళనలో కన్నా పాల్గొనాల్సిన అవసరంలేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో విష్ణు పేరుకి బీజేపీలో ఉన్నా.. ఆయన కులానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడతారని, ఆయనకు కులపిచ్చి అని విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇవేవో సాధారణ రాజకీయ విమర్శలు కాదు. జనసైనికులు ఎంతో శ్రమించి దాదాపు పదేళ్ల క్రితం నాటి సాక్ష్యాలను వెలికి తీసి.. విష్ణుకి కులపిచ్చి ఉందని రుజువుచేసారు.

 

 

దాదాపు పదేళ్ల క్రితం.. విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. అయితే అప్పట్లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే తెలియకపోవడమే మంచిది అనుకుంటారు. ఆయన ట్వీట్లు చూస్తే ఆయనకు ఎంత కులపిచ్చి ఉందో అర్ధమవుతుంది. ఆయన కులానికి చెందిన వారిని పేరుపేరునా పొగుడుతూ ట్వీట్ చేయడం. మిగతా కులాల్ని కించపరచడం. అంతేకాదు ఆడవారి అందాల గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం. ఇలా ఆయన పదేళ్ల క్రితం చేసిన ఏ ట్వీట్ చూసినా చండాలమే. ఛీ ఛీ ఈయన ఓ జాతీయ పార్టీ నాయకుడా అనుకునేలా ఉన్నాయి ఆయన ట్వీట్స్. రాజకీయ నాయకుడు కులాలు, మతాలతో సంబంధం లేకుండా.. అందర్నీ కలుపుకొని పోతూ ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈయన నరనరాల్లో కులపిచ్చి నింపుకొని ప్రజాసేవ అర్థాన్నే మార్చేశారు. దీంతో ప్రస్తుతం విష్ణుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.

 

 

కాగా, పదేళ్ల క్రితం ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవ్వడం, విమర్శలు రావడంతో.. విష్ణు మొదట ఆ ట్వీట్లను డిలీట్ చేసే ప్రయత్నం చేసారు. ఆ ట్వీట్లు వందల్లో ఉండటంతో ఇక చేసేది లేక అకౌంట్ నే తీసేసారు. అయినా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుండటంతో.. ఇక చేసేదేమి లేక.. అబ్బే ఆ ట్వీట్లకు నాకేం సంబంధం లేదు, అప్పట్లో ఆ అకౌంట్ ని థర్డ్ పార్టీ చూసేది అంటూ ఏదో చెప్పుకొచ్చారు. కానీ అవి నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే.. ఒకవేళ నిజంగానే ఆయనకు ఆ ట్వీట్లకు సంబంధం లేకపోతే.. విమర్శలు రాగానే కొన్ని ట్వీట్లు ఎలా డిలీట్ అయ్యాయి? తర్వాత ఏకంగా అకౌంటే ఎందుకు డిలీట్ అయింది?. అందుకే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు.. ముందే చేతులు కాలకుండా చూసుకోవాలి అని. మరి ఇప్పటి ప్రభుత్వాలు.. ఎవరైనా సామాన్యులు చిన్న ట్వీట్ చేస్తే చాలు.. కేసులు, అరెస్ట్ లు అంటున్నాయి.. మరి ఈయన గారు కులాల్ని కించపరుస్తూ చేసిన ట్వీట్లపై ఎలా స్పందిస్తాయి?. వీటిపై విచారణ చేసి, చర్యలు తీసుకునే సాహసం చేస్తాయా? చూడాలి.