దానికైతే ఒక్క రోజు.. దీనికి మాత్రం నెలలు పడుతుందా: జగన్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ ఫైర్

 

 

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడి 75 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఇసుక పై ఒక విధానం అంటూ లేకపోవడంతో సామాన్యులు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయమై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పని తీరు చూస్తుంటే ఆయనకు సరైన సలహాదారులు లేరని తెలుస్తోందన్నారు. ప్రజావేదిక పై త్వరత్వరగా స్పందించి ఒక్క రోజులోనే కూల్చిన ఇదే ప్రభుత్వం మరి ఇసుక విధానం పై మాత్రం 75 రోజులు గడుస్తున్నా ఎందుకు నిర్ణయం తీసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. ఇసుక లభించక పోవడంతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని అయన అన్నారు. 70 రోజులుగా తనకు సీఎం అపాయింటుమెంట్ కూడా దొరకలేదని అయన ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని అయన అన్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ప్రజాసమస్యల పై చర్చించాలంటే ఒక్క రోజులోనే సమయం కేటాయించేవారని ఆయన గుర్తు చేశారు. నేతలు అధికారులతో కుమ్మక్కు ఐనపుడే కాంట్రాక్టులలో అవినీతి సాధ్యం అవుతుందన్నారు.