ఇక టీడీపీ తానా సభలకే పరిమితం.. బీజేపీ ప్రతీకారం!

 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ కు ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభల్లో అవమానం జరిగిన సంగతి తెలిసిందే. తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ మాధవ్.. ప్రధాని మోడీని కీర్తిస్తూ ప్రసంగిస్తుండగా ఎన్నారైలు అడ్డుకున్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని, అటువంటి పార్టీ గురించి, ప్రధాని మోడీ గురించి ఇక్కడ ప్రస్తావించవద్దని రామ్‌మాధవ్‌ కు తేల్చిచెప్పారు. ఆయన ప్రసంగిస్తోన్నంత సేపు అరుపులు, కేకలతో నిరసనను వ్యక్తం చేశారు. అయినా వారి నిరసనలను పట్టించుకోకుండా రామ్‌మాధవ్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రధాని మోడీ వల్ల దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని చెబుతుండగా.. సభికులు మరింతగా కేకలు, ఈలలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్థంతరంగా ఆపేసి అవమానభారంతో స్టేజీ దిగి వెళ్లిపోయారు. అయితే తన ప్రసంగాన్ని అడ్డుకున్నది.. టీడీపీకి చెందిన వారేనని, సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తానని రామ్‌మాధవ్‌ అన్నారు. మిగతా బీజేపీ నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అయితే సమయం వచ్చినప్పుడు టీడీపీ సంగతి తేలుస్తానని చెప్పిన రామ్‌మాధవ్‌.. తాజాగా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. టీడీపీ పని అయి పోయిందని, ఇక ఆ పార్టీ తానా సభలకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తామే ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అన్నారు. టీడీపీది ముగిసిపోయిన అధ్యాయమని, ఆ పార్టీ ఇప్పటికే తెలంగాణలో కనుమరుగు అయిందని, ఏపీ లోనూ అదే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని వ్యాఖ్యానించారు.