స్వార్థపరులే వైసీపీలోకి.. బీజేపీ రిమోట్‌ కంట్రోల్‌ పార్టీ కాదు!!

 

దేశహితాన్ని కోరుకునే వారు బీజేపీలో చేరుతారని, తాత్కాలిక ప్రయోజనాలు, స్వార్థం కోరుకునే వారు అధికార వైసీపీలో చేరుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత సైకం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. గడచిన 2 నెలల్లో చాలామంది ప్రముఖులు బీజేపీలో చేరానని, రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ పాలనలో చూపిన సత్తాయే ఇందుకు కారణమన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పనితీరును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, వారు వాస్తవాలు తెలుసుకున్న రోజున బీజేపీ వెన్నంటి నడుస్తారని జోస్యం చెప్పారు.

కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ నూతన పాలన కోరుకుంటున్నామన్నారు. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుందని ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. నిర్మాణం ప్రారంభం కాలేదు కానీ విధ్వంసం జరుగుతోందని రాంమాధవ్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ ఊరుకోబోమని రాంమాధవ్‌ హెచ్చరించారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేసేందుకు సహకరిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే ప్రతిపక్షపాత్ర పోషిస్తామని.. పోరాటాలు చేసేందుకు కూడా సిద్ధమేనన్నారు. బీజేపీ రిమోట్‌ కంట్రోల్‌ పార్టీ కాదని రాంమాధవ్‌ స్పష్టం చేశారు.