TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మా లెక్క ప్రకారం వైసీపీకి 110 సీట్లొస్తాయి.. కానీ?: బీజేపీ నేత

Published on: Wed May 8, 2019 12:50PM

 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురశీధర్‌రావు.. తెలుగు రాష్ట్రాల రాజీకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో వైసీపీకి 110 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప ఎన్నికల కార్యదక్షుడు అని.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

తెలంగాణలో బీజేపీ 6 ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌తోపాటు మరో రెండు లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో గత నెల రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ 280 నుంచి 310 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అన్నారు. యూపీలో గత ఎన్నికల్లో 72 స్థానాలు గెలుచుకున్న తాము.. ఈసారి 35 నుంచి 40 స్థానాల్లో మాత్రమే గెలుస్తామని నెల రోజుల క్రితం భావించామని, కానీ ఇప్పుడు 70కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
 
దేశవ్యాప్తంగా తమ మిత్రపక్షాలకు 45 నుంచి 50 స్థానాలు లభిస్తాయని, మోదీయే మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం వీస్తోందని, కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలకు 150కి మించి స్థానాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్‌ గెలిచిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి 2014 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు వస్తాయన్నారు.