పాకిస్థాన్ కోడలు సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?

 

తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కి కోడలిగా వెళ్లిన సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం చాలా దారుణమైన విషయమని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిసెంబర్లో జరిగే హైదరాబాద్ స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లిం ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి ఫీట్లు చేస్తోందని ఆయన విమర్శించారు. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం, ముస్లింలకు రిజర్వేషన్లు, రంజాన్‌కు ముందే జీతాల చెల్లింపులు ఈ పథకంలో భాగమేనని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మజ్లిస్‌కు తెరాస తలొగ్గి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ పొందుపర్చిందని, ఫీజు రీయింబర్స్‌మెంటుకు 1956 స్థానికత నిబంధనను పెట్టిన తెరాస ప్రభుత్వం మహారాష్ట్రలో పుట్టి పాకిస్థాన్ కోడలిగా వెళ్లిన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. మరి ఇప్పుడు సోనియాకు స్థానికత వర్తించదా అని డాక్టర్ లక్ష్మణ్ నిలదీశారు.