TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆప్ఘన్‌లో తాలిబన్ పాలనలా.. జగన్ పాలన! బీజేపీ నేత హాట్ కామెంట్స్.. 

Published on: Wed Sep 8, 2021 10:32AM

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సర్కార్ ఆంక్షలు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి పండగపై  ఆంక్షలు పెట్టడమంటే...హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లడమే అని అన్నారు. జగన్ అన్నీ తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నారని విమర్శించారు. 

ఏపీ ప్రజల దురదృష్టవశాత్తు జగన్ పొరపాటున మరొకసారి సీఎం అయితే..వినాయక చవితిని ఎవ్వరి ఇంటిలోనూ చేసుకోనివ్వరని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆప్ఘన్‌లో తాలిబన్ పాలనలా...అప్పుడు జగన్ పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అన్నీ నాశనం..వినాశనమే అని, తమిళనాడు సీఎం స్టాలిన్ చూసి జగన్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని హితవుపలికారు. దేవాలయాలపై దాడులు, రథం దగ్దం లాంటి ఎన్నో  ఘటనలు ఏపీలోజరిగాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అనర్హుడని అన్నారు.  బీజేపీ నేతలపై కేసులు పెడితే భయడతామా? అన్న విష్ణుకుమార్ రాజు..  ముందు మీ మీద ఉన్న కేసుల నుంచి బయటపడండి అంటూ ముఖ్యమంత్రికి హితవు పలికారు. 

వైసీపీ నేత‌లు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు వేలాది మంది త‌ర‌లివ‌స్తే రాని క‌రోనా.. ప్ర‌జ‌లు వినాయ‌క చ‌వితి చేసుకుంటే మాత్రం వ‌స్తుందా? అని బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి నిల‌దీశారు.'ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు.. మీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి గారు వేల మందితో జగనన్న అద్దాల మహల్  ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే కరోనా రాదా సార్?' అని ఆయ‌న నిల‌దీశారు. '20 మంది హిందూ యువ‌కులు వీధిలో వినాయకుడిని పూజిస్తే మాత్రమే వస్తుందా? మీ వాళ్లు ఏమైనా క‌రోనా రహిత కార్యకర్తలా?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల ర్యాలీకి సంబంధించిన వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు.