విజయ్ సాయి రెడ్డి, జగన్ ల పై పెరుగుతున్న బీజేపీ దాడి

 

 

నిన్న సాయంత్రం విజయసాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా అశీసులు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐతే దీని పై బీజేపీ నుంచి ఎదురు దాడి తీవ్రమైంది. దీని పై సుజనా చౌదరి నిన్న స్పందిస్తూ దీని పై మోడీ అమిత్ షాలకు కంప్లైంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదే విషయమై బీజేపీ నేత పురందేశ్వరి జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం రివర్స్‌ టెండర్లు, పీపీఏల రద్దు అనేవి జగన్‌ ప్రభుత్వ స్వయంకృతాపరాదాలని ఆమె అన్నారు. పీపీఏల రద్దు పై కేంద్రం ఎన్ని లేఖలు రాసినా జగన్  పట్టించుకోలేదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మోడీ షాల అశీసులు ఉన్నాయనేది పచ్చి అబద్దమని పురందేశ్వరి స్పష్టం చేశారు.  తాజాగా ఇదే విషయం పై ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా స్పందిస్తూ గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇపుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏక పక్షంగా వెళ్ళొద్దని, ఆలా వెళ్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఎంత మొత్తుకున్నా జగన్ ప్రభుత్వం ఏమాత్రం వినలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  చేసిన తప్పును ధైర్యంగా చెప్పుకోలేక కేంద్రంపై నెట్టడం సరికాదని కన్నా చెప్పారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం, పోలవరం అథారిటీ చేసిన సూచనలను జగన్ పట్టించుకోలేదని అయన ధ్వజమెత్తారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని కన్నా తెలిపారు.