బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కు.. కవితకు ఓటమి తప్పదా?

 

బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యర్థి పార్టీలు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఒంటి కాలు మీద లేస్తారు. అయితే ఇదంతా జాతీయ రాజకీయాల్లోనేనట. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు శ్రేణులు కలిసి పనిచేసి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో టీఆర్ఎస్ భావించినట్లు 16 సీట్లు గెలిచే అవకాశం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రెండు,మూడు సీట్లు వరకు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి. అయితే బీజేపీకి రెండు మూడు స్థానాల్లో గెలుపు అవకాశాలు రావడానికి కారణం కాంగ్రెస్ సహకారమే అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రెండో దఫా పోటీ చేశారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ బరిలోకి దిగారు. అయితే అరవింద్.. గతంలో కాంగ్రెస్ లో బలమైన నేతగా పేరు తెచ్చుకున్న డి. శ్రీనివాస్ తనయుడు కావడంతో.. ఆయన వెంట మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలిచారని ప్రచారం జరుగుతోంది. అదీగాక ఎలాగైనా కవిత గెలుపుకి బ్రేకులు వేయాలని భావించిన మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు.. ఓట్లు చీల్చకూడదని భావించి అరవింద్ కి ఓటేసినట్లు తెలుస్తోంది.

కరీంనగర్ స్థానంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కరీంనగర్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడర్ ఎక్కువగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఓటు వేయాలని కోరినట్టుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ లో బండి సంజయ్ కి ఉన్న సొంత ఇమేజ్ కి తోడు, కాంగ్రెస్ కేడర్ కూడా తోడు కావడంతో.. కరీంనగర్ లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిజామాబాద్, కరీంనగర్ లలోనే కాదు.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణ పోటీ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపుని ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన కాంగ్రెస్ నేతలు.. మొన్నటి వరకు తమ పార్టీలో ఉండి వెళ్లిన డీకే అరుణ గెలుపు కోసం కృషి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ జోరుకి అడ్డుకోవడం కోసం.. కాంగ్రెస్ తన ప్రత్యర్థి అయిన బీజేపీ గెలుపుకి కృషి చేసిందని ప్రచారం జరుగుతోంది.