వెంకన్న సాక్షిగా మోదీ హామీ..

అవిశ్వాసం,తదనంతర పరిణామాలపై మాట్లాడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకే అవిశ్వాసం పెట్టామని ఆయన స్పష్టం చేశారు.15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు.

 

 

అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.తిరుపతి, నెల్లూరులో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చాలాసార్లు కేంద్రాన్ని కోరామని చంద్రబాబు చెప్పారు. దిల్లీని మించిన రాజధాని నిర్ముంచుకోవచ్చని నమ్మబలికారని.. తర్వాత పట్టించుకోలేదని అన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మరిచిపోయారని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను మాత్రమే నెరవేర్చాలని ప్రధానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి.. ఒక్కటీ నెరవేర్చలేదు. కేంద్ర పెద్దలందరినీ కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశామని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు శతవిధాలు ప్రయత్నించామని చెప్పారు.ఏపీ ప్రజలకు కేంద్రం నమ్మకం కల్పించలేకపోయిందని, ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించిందని చంద్రబాబు విమర్శించారు. మరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండబోదన్నారని, హోదాతో సమానంగా నిధులు ఇస్తామని చెప్పారని కానీ 11 రాష్ట్రాలకు రాయితీలు కొనసాగిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.14వ ఆర్థికసంఘం పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రాలతో సంబంధాలు కొనసాగించే పద్ధతి ఇదేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన నిలదీశారు.నిన్న సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు బాధించాయని చంద్రబాబు కేంద్రం తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.తెలంగాణతో మేం తగాదాలు పెట్టుకున్నామని,తన కంటే కేసీఆర్‌ పరిణతితో వ్యవహరించారని నన్ను విమర్శించారు.యూ టర్న్‌ తనది కాదని, ఇచ్చిన హామీలు అమలు చేయని మీదే యూటర్న్‌ అని కేంద్రాన్ని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు.అవినీతిని సహించబోమంటూ గాలి అనుచరులకు టికెట్లు ఇచ్చారని, వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోదీ తనతో అన్నారని, తానెప్పుడూ తప్పుచేయనని మోదీతో చెప్పానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని ఆ మాటలు అనడం ఏపీ ప్రజలను అవమానించడమేనని, నిన్న జగన్‌ కోర్టులో ఉంటే తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారని వైసీపీని చంద్రబాబు ఎద్దేవా చేశారు.