మూలిగే ఏపీ బీజేపీ నక్కపై…. జీవిఎల్ అనే తాటికాయ!

వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ చెరోవైపు నిలిస్తేనే రెండు ఎంపీ సీట్లోచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కమలాన్ని వదిలేశారు. పైగా అప్పుడు కాంగ్రెస్ విభజన చేసి ఆంధ్రుల్ని అడ్డంగా అన్యాయం చేసింది. ఆ బాధతో బీజేపీ లాంటి జాతీయ పార్టీ తమని ఆదుకుంటుందని ఏపీ ఓటర్లు భావించారు. మోదీని కూడా చాలా మందే నమ్మారు. కానీ, నాలుగేళ్లు గడిచే సరికి కాషాయ పార్టీ తలకిందులైపోయింది… ఏపీలో ఇచ్చిన రెండు సీట్లకు సరిపడా న్యాయం కూడా చేయలేదు మోదీ సర్కార్. ప్రత్యేక హోదా కాదంటే కాదని తెగేసే చెబుతోంది. పోలవరంకు ఇస్తున్న నిదులు అంతంతమాత్రమే. ఇక విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి డిమాండ్లపై ఎప్పుడు ఎవరు ఏ కామెంట్ చేస్తారో కేంద్రం పెద్దలకు, బీజేపీ నేతలకే తెలియాలి. మరి ఇటువంటి స్థితిలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో రాబోయే సీట్లు ఎన్ని? ఇంతకు ముందటి రెండు సీట్ల సంఖ్యని నిలబెట్టుకుంటే … అదే పదివేలు!

 

 

ఇప్పటికే చాలా డ్యామేజైన ఏపీ బీజేపీ పరిస్థితిని ఓ జాతీయ స్థాయి తెలుగు కాషాయ నేత మరింత దిగజారుస్తున్నారు! అతనే… జీవిఎల్ నరసింహా రావు! ఈయన జాతీయ ఇంగ్లీషు న్యూస్ ఛానల్స్ లో బలంగానే వాదిస్తారు. బీజేపీపైన, ఆరెస్సెస్ పైన, మోదీ, షా వంటి నేతలపైనా ఈగ వాలనీయరు. ఆర్నాబ్ గోస్వామి లాంటి వారి చర్చల్లో కాంగ్రెస్ ను, కమ్యూనిస్టుల్ని ఉతికి ఆరేస్తుంటారు. తెలుగు వాడిగా జాతీయ స్థాయిలో జీవిఎల్ పర్ఫామెన్స్ మనకు గర్వకారణమే! కానీ, తీరా మన స్వంత రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాత్రం…. టీడీపీ వారి భాషలో చెప్పాలంటే… శనీశ్వరుడిలా తయారయ్యారు!

 

 

బీజేపీ అధికార ప్రతినిధిగా జీవిఎల్ ఇంగ్లీషు, హిందీ చర్చల్లో అదరగొడితే అదరగొట్టి వుండవచ్చు కానీ తెలుగు రాజకీయాలకు వచ్చేటప్పటికి తన పార్టీకి మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నారు. జీవిఎల్ ఏదో ఒక మాట అనటం… దానికి టీడీపీ మంత్రులు, నేతలు ఘాటుగా స్పందించటం పరిపాటి అయిపోయింది. ఇక ఈ మధ్య ఏపీ ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు కుటుంబ రావు మరీ తీవ్రంగా దాడి చేసేశారు జీవిఎల్ పై! పీడీ అకౌంట్లలోని డబ్బు విషయంలో చంద్రబాబు సర్కార్ పై నరసింహా రావు లేనిపోని ఆరోపణలు చేశారు. అవి నిజమైనా కాకున్నా నిరూపించగలిగేవి అస్సలు కావు. అలాంటి ఆరోపణలు చేస్తే స్వయంగా ఆర్దిక మంత్రి యనమల తీవ్రంగా ఖండించారు. లెక్కలతో సహా పీడీ అకౌంట్ల సంగతంతా మీడియా ముందు పెట్టారు. అయితే, కుటుంబ రావు మాత్రం జీవిఎల్ ని ఏకంగా బుడబుక్కలోడు అనేశారు! ప్రతీ బుడబుక్కోలోడి ఆరోపణలకి విలువ ఇస్తూ పోతే పాలన ఎలా చేయాలి అన్నారు!

 

 

జీవిఎల్ పై వస్తోన్న వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే ఆయన వ్యవహారం వల్ల ఏపీ బీజేపీకి మాత్రం దారుణమైన పరిస్థితే ఎదురయ్యేలా వుంది! గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన సున్నా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఈ సారి బీజేపీకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, అసలే జనం హోదా విషయంలో బీజేపీ సర్కార్ తమని మోసం చేసిందని భావిస్తున్నారు. అటువంటి స్థితిలో మూలిగే నక్కపైన తాటికాయ లాగా… జీవిఎల్ రెచ్చగొట్టే ధోరణి మరింత నష్టం కలిగించకమానదు. మరి దీని గురించి అమిత్ షా ఏం చేస్తారో? ఎలాగూ దిల్లీ పెద్దలు ఆంధ్రా ఎంపీ సీట్లపై ఆశలు వదిలేశారు కాబట్టి చంద్రబాబుపై బురద జల్లే కార్యక్రమం కొనసాగించమని జీవిఎల్ కు చెబుతున్నది వారేనేమో!