ఏపీలో కమలం విరియకముందే వాడి పోతుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. కానీ రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో కుప్పకూలిపోయింది. కనీసం అన్ని స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేని స్థాయికి దిగజారిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజీపీది కూడా ఇదే పరిస్థితి.

 

బీజీపీ ఆంధ్రప్రదేశ్ లో మొదటినుంచి బలమైన పార్టీ ఏం కాదు. కానీ 2014 ఎన్నికల్లో మోడీ మేనియాతో పాటు టీడీపీతో కలిసి పోటీ చేయడంతో గౌరవప్రదమైన ఓట్లు, సీట్లు సాధించింది. ఆ తరువాత ఏపీలో ఒంటరిగా బలపడాలని చూసింది కానీ.. ఓ రకంగా బీజీపీ వేస్తోన్న అడుగులే ఆ పార్టీ ఎదుగుదలకి అడ్డుపడుతున్నాయి. అధికారంలోకి రాకముందు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. అదే ప్రత్యేకహోదా మాట నిలబెట్టుకొని ఉంటే.. ఏపీలో బీజేపీకి మంచి మైలేజ్ వచ్చేది. అంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోవడమే కాకుండా.. ఏపీ ప్రజల నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంది.

 

ఇక రాజధాని విషయంలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం చేయడం ఏపీలో ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థంలో పడేసింది. రాష్ట్ర నాయకులుగా ఏపీ రాజధాని అమరావతే ఉండాలని కోరుకుంటాం.. కానీ రాజధాని విషయంలో కేంద్ర కలగచేసుకోదు అంటున్నారు. పోనీ రాష్ట్ర నాయకులు అమరావతే ఉండాలని పోరాడుతున్నారా అంటే అదీ లేదు. 

 

ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ అండ ఉందన్న ప్రచారం ఉంది. తాజాగా గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలపడంతో.. ఆ ప్రచారం నిజమన్న భావన మొదలైంది. ఎందుకంటే ఈరోజుల్లో గవర్నర్ పదవి అనేది అలంకారప్రాయం. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీకి అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయి. అంతెందుకు కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా బీజేపీని ఆహ్వానించడం.. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలనిరూపణకు సమయం ఇవ్వకుండా ఆలస్యం చేయడం.. ఇలాంటి కొన్ని ఉదాహరణలు చాలవా? గవర్నర్ నిర్ణయాలు కేంద్రంలోని తమ పార్టీకి నచ్చేవిలా ఉంటాయని చెప్పడానికి. 

 

అలాగే ఇప్పుడు ఏపీ రాజధానుల బిల్లు విషయంలో కేంద్రాన్ని సంప్రదించకుండా గవర్నర్ నిర్ణయం తీసుకొని ఉండరనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు రాజధానుల బిల్లుని ఆమోదించవద్దని గవర్నర్ కి లేఖ రాసిన కన్నా లక్ష్మీనారాయణను తప్పించి ఆయన స్థానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుని తీసుకురావడం, ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే గవర్నర్ రాజధానుల బిల్లుకి ఆమోదం తెలపడం.. చూస్తుంటే బీజేపీ పరోక్షంగా మూడు రాజధానులకు మద్దతు తెలిపిందన్న భావన కలుగుతోంది.

 

మొత్తానికి అమరావతి విషయంలో బీజేపీ అనుసరిస్తోన్న తీరు.. ఏపీలో ఆ పార్టీ భవిష్యత్ ని ప్రశ్నార్థంలో పడేసింది. మూడు రాజధానుల బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపడంతో.. అమరావతిని రాజధానిగా కోరుకునే వారు వైసీపీని ఎంత వ్యతిరేకిస్తారో బీజేపీని అదేస్థాయిలో వ్యతిరేస్తారు. మరోవైపు, మూడు రాజధానులకు మద్దతు తెలిపేవారికి కూడా బీజేపీ దగ్గరయ్యే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం అమరావతికే మా ఓటు అంటుంది. అంటే ఇటు పోరాడి అమరావతికి మద్దతిచ్చే వాళ్లకూ దగ్గరవ్వట్లేదు, అటు వ్యతిరేకించి మూడు రాజధానులకి మద్దతు తెలుపుతున్న వాళ్ళకీ దగ్గరవ్వట్లేదు. రెండు పడవల మీద కాలేస్తూ.. ఏపీలో బలపడాలన్న కలని కలగానే మిగుల్చుకొంటుంది.