TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంటికో ఉద్యోగం, స్కూటీ, ల్యాప్‌టాప్‌.. యూపీలో ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ...

Published on: Tue Feb 8, 2022 5:38PM

ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఒక‌టే రామ‌బాణం.. అవే ఉచిత హామీలు. ఎన్ని ఫ్రీ హామీలు ఇస్తే అంత ఫ్రీగా విజ‌యం వ‌రిస్తుంద‌నేది రాజ‌కీయ పార్టీల భావ‌న‌. అందులో ఏ పార్టీ కూడా త‌క్కువేమీ కాదు. కేంద్రంలో అధికారంలో ఉండి.. రాష్ట్రాల‌కు నీతులు చెప్పే బీజేపీ.. ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి యూపీలోనూ ఉచిత భ‌జ‌న మొద‌లుపెట్టేసింది. 

‘లోక్‌ కల్యాణ్ సంకల్ప పత్రం’ పేరుతో అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టో మొత్తం ఉచితాల‌తో దింపేశారు. తెలంగాణ‌లో ఉచిత విద్యుత్ ఇస్తుంటే త‌ప్పుబ‌డుతున్న కేంద్రం.. యూపీలో మాత్రం బీజేపీ అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం. పువ్వు గుర్తును మ‌రోసారి గెలిపిస్తే.. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని ప్రామిస్ చేసింది. ఇక విద్యార్థినిల‌కు, ఉద్యోగం చేసే మ‌హిళ‌ల‌కు ఉచితంగా స్కూటీలు ఇస్తామని, స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు అందిస్తామంటూ త‌మిళ‌నాడు త‌ర‌హా ఫ్రీ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది.  

ఏడాదిలో 2 సిలిండర్లు ఉచితంగా ఇవ్వ‌డం.. త‌మిళ‌నాడులో అమ్మా క్యాంటీన్లు, ఏపీలో గ‌తంలో ఉన్న‌ట్టు ఎన్టీఆర్ క్యాంటీన్లు త‌ర‌హాలో ‘మా అన్నపూర్ణ క్యాంటీన్’ ఏర్పాటు చేస్తామంటూ సౌత్ ఇండియా స్కీంస్ కాపీ కొట్టేసింది నార్త్ ఇండియా బీజేపీ. ఇక‌, శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని పునరుద్ధరించడం వంటి హామీలు కూడా యాడ్ చేసింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని.. యూపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తామ‌ని మేనిఫెస్టోలో ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ బాగా పాలించామంటూ భుజాలు త‌డుముకుంటున్న క‌మ‌ల‌నాథులు.. ఇప్పుడిలా ఉచితాలతో ఊద‌ర‌గొడుతున్నారంటే.. ఆ పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? అనే అనుమానం వ‌స్తోందంటున్నారు.  యూపీ ఏడు దశల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. మొదటి దశకు ఫిబ్రవరి 10న ముహూర్తం. 

బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇవే...   

--వచ్చే ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు. అందులో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం.  

--కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాల పంపిణీ. కన్యా సుమంగళ యోజన కింద ఇచ్చే మొత్తం రూ.25 వేలకు పెంచుతూ హామీ.  

--ఉజ్వల యోజన పథకం కింద హోలీ, దీపావళి పండుగల వేళ మహిళలకు రెండు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు.

-- పట్టణ పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించేందుకు ‘మా అన్నపూర్ణ క్యాంటీన్’ ఏర్పాటు.

--60 ఏళ్లు పైబడిన మహిళలు ప్రజా రవాణాలో ఉచితంగా ప్రయాణించే అవకాశం. 

--వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌లో పెంపుదల.  

--సాగునీటి కోసం రైతులకు ఉచిత విద్యుత్ వెసులుబాటు. గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర. 

--చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ.5,000 కోట్లు. వచ్చే 15 ఏళ్లలో చెరుకు సంబంధిత బకాయిల మాఫీకి హామీ.