కమలం టాప్ గేర్, కారు బేజారు!!

 

మరి కొద్ది నెలల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో టీఆరెఎస్ సెంచరీ కొట్టి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది. మిగిలిన సీట్ల లో కూడా దాని మిత్ర పక్షమైన ఎంఐఎం తన జెండా ఎగరేసింది. టీడీపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. మొన్న ఏప్రిల్ లో నగర పరిధిలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ చెరొక స్థానం గెలిచి కారుకు సవాలు విసురుతున్నాయి. తాజాగా అమిత్ షా స్వయంగా సీన్ లోకి ఎంటర్ అయి తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న పరిస్థితుల్లో టీఆరెఎస్ గెలుపు పై డౌట్లు మొదలయ్యాయి.

దీనికి తోడు పార్టీకి అండగా ఉంటాడనుకున్న వివేక్ ఇప్పటికే బీజేపీ లో చేరగా, టిటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే టీఆరెఎస్ సీనియర్ నేతలు కేకే, కడియం శ్రీహరి వంటి నేతలు కూడా కమలం గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ అంశం లో ఆర్టికల్ 370 తొలగించడం జిహెచ్ఎంసి ఎన్నికలలో ఆ పార్టీకి ప్లస్ అవుతుందని అలాగే టీఆరెఎస్ దోస్త్ ఐన ఎంఐఎం దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అది టీఆరెఎస్ కు మైనస్ అవుతుందని విశ్లేషకుల అంచనా. ఎలాగైనా వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికలలో గ్రేటర్ లో పాగా వేసి 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ద్వారా తెలంగాణ లో జెండా ఎగరేయాలని బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో పక్క నగర పరిధిలోని టీఆరెఎస్ ఎమ్మెల్యేలు మరియు నేతల మధ్య విభేదాల తో ఈ సారి నెగ్గుకు రావడం కొంత కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు జీహెచ్ ఎంసీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో..