TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పెష‌ల్ స్టేట‌స్‌తో బిగ్‌ స్కెచ్‌? ఏపీలో ఆప‌రేష‌న్‌ ఆక‌ర్ష్‌!

Published on: Sat Feb 12, 2022 7:54PM

సీన్ 1: ఫిబ్రవరి 8, రాజ్యసభ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ గంభీరంగా మాట్లాడారు. కాంగ్రెస్ పై విరుచుకుప‌డ్డారు. మ‌ధ్య‌లో సడెన్ గా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. ఏపీ విభ‌జ‌న తీరు సరిగా లేదు.. ఏపీ, తెలంగాణ ఇప్ప‌టికీ న‌ష్ట‌పోతున్నాయంటూ మానిన గాయాన్ని మ‌ళ్లీ కెలికారు. అదేంటి ప్ర‌ధాని మోదీకి స‌డెన్‌గా ఏపీ విభ‌జ‌న‌పై అంత ఆక్రోషం ఎందుకొచ్చింది? ఏపీపై అంత ప్రేమ ఎందుకొచ్చింద‌నే చ‌ర్చ న‌డిచింది. 

సీన్ 2: ఫిబ్ర‌వ‌రి 10, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. దేశంలోకే అతిపెద్ద రాష్ట్ర‌మైన యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల తొలి ద‌శ జ‌రిగింది. అంత‌కుముందే స‌ర్వేలు, ప్రీపోల్స్‌లో.. మోదీ, యోగిల గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మైంద‌ని, ఈసారి బీజేపీ స్థానాలు భారీగా త‌గ్గిపోతాయ‌ని వెల్ల‌డైంది. పోలింగ్ స‌ర‌ళి సైతం క‌మ‌ల‌నాథుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. 

సీన్ 3: ఫిబ్ర‌వ‌రి 12, ఢిల్లీ.. ఏపీ విభ‌జ‌న స‌మస్య‌ల‌పై చ‌ర్చించేందుకు కేంద్ర‌హోంశాఖ ముగ్గురు సభ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. ప్ర‌తీనెలా భేటీ జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించింది. చ‌ర్చ‌ల ఎజెండాలో ప్ర‌త్యేక హోదాను చేర్చడం క‌ల‌క‌లం రేపింది. ఆ వెంట‌నే స్పెష‌ల్ స్టేట‌స్‌ను ఎజెండా నుంచి తొల‌గించి ఉత్త‌ర్వులు స‌వ‌రించింది కేంద్రహోంశాఖ‌. 

పైపైన చూస్తే ఈ మూడు వేరు వేరు సీన్లని అనిపిస్తాయి. అదే రాజ‌కీయం మ‌రి. ఈ మూడు విష‌యాలు ఒకే పొలిటిక‌ల్‌ డ్రామాలో వేరు వేరు సీన్లు అనేది విశ్లేష‌కుల మాట‌. ముందు సీన్ 1.. మోదీ ప్రసంగం విషయానికి వద్దాం. మోదీ ఏమీ సాధారణ వ్యక్తి కాదు.. ఏదో ఎమోష‌న్‌లో రాజ్య‌స‌భ‌లో ఏపీ విభ‌జ‌న అంశం ప్ర‌స్తావించ‌డానికి. క‌రుడుగ‌ట్టిన రాజ‌కీయ నేత‌. దేశ ప్ర‌ధాని. ఆయ‌న అంత ఈజీగా ఏదో నోరు జారార‌ని అనుకోవ‌డానికి లేదు. ముంద‌స్తు ప్రిప‌రేష‌న్ మేర‌కే స‌భ‌లో ఏపీ విభ‌జ‌న తీరును తీసుకొచ్చార‌ని అనుకోవ‌చ్చు. లేదంటే, అమ‌రావ‌తికి కేవ‌లం మ‌ట్టి, నీళ్లు ఇచ్చిన మ‌హానుభావుడు.. ఏడేళ్లుగా ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌ని ప్ర‌ధాని.. పోల‌వ‌రం నిధుల‌కు అడ్డుక‌ట్ట వేసిన రాజ‌కీయ నాయ‌కుడు.. అలాంటి మోదీకి స‌డెన్‌గా ఏపీ క‌ష్టాలు గుర్తొచ్చాయ‌ని అనుకోవ‌డానికి లేదు. ఆ మాట‌ల వెనుక ప‌క్కా ప్లాన్ ఉండే ఉంటుంది. 

ఇక సీన్ 2.. యూపీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. యావ‌త్ దేశంలో మాదిరే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ మోదీ, బీజేపీ, యోగీ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మైంద‌ని పీపుల్స్ ప‌ల్స్‌ను బ‌ట్టి తెలుస్తోంది. రైతుల ఉద్య‌మం, అన్న‌దాత‌ల‌ను బీజేపీ నేత కారుతో గుద్ది చంప‌డం.. లాంటి ఘ‌ట‌న‌ల‌తో యూపీలో క‌మ‌లం బాగా వాడిపోయింది. స‌ర్వేలు, ప్రీపోల్స్ సైతం అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈసారి బీజేపీ సీట్ల‌కు భారీగా కోత ప‌డ‌నుంది. అధికారం క‌మ‌లానికి చిక్కినా.. మునుప‌టిలా పెద్ద మెజార్టీ రాక‌పోవ‌చ్చు అంటున్నారు. ముందుముందు మోదీ ఇమేజ్ మ‌రింత డ్యామేజ్ కానుంద‌నే అంచ‌నాల‌తో.. బీజేపీ-మోదీ ముంద‌స్తుగా అల‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు. యూపీ కాక‌పోతే ఏంటి? అనే ఆలోచ‌న‌లో వారికి ఏపీ గుర్తొచ్చింద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీలో జ‌న‌సేన‌తో బీజేపీకి పొత్తు ఉంది. ఓట్లు, సీట్లు రాక‌పోయినా.. ప‌వ‌న్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ బ‌లం మెండుగా ఉంది. అలాంటి జ‌న‌సేన స‌పోర్ట్‌తో రాష్ట్ర బీజేపీకి కాస్త బూస్ట్ ఇస్తే.. ఆంధ్ర నేల‌లో క‌మ‌లం పువ్వు బాగా విక‌సించే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీలో కూర్చొని క‌మ‌ల‌నాథులు విశ్లేషించార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో క‌మ‌లం తోట‌కు ఓట్ల నీళ్లు పారించేందుకు.. ప్ర‌త్యేక హోదా అనే ఎరువు వేస్తున్నార‌నే అనుమానం వ్య‌క్తం అవుతోంది. 

స్పెష‌ల్ స్టేట‌స్.. ఆంధ్రుల ఏడేళ్ల స్వ‌ప్నం. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం సీఎంగా చంద్ర‌బాబు చేసినంత పోరాటం మ‌రెవ‌రూ చేయ‌లేదనే చెప్పాలి. ఏకంగా కేంద్రంపై ధ‌ర్మ‌పోరాట‌మే చేశారాయ‌న‌. ఇక స్పెష‌ల్ స్టేట‌స్ కోసం టీడీపీ ఎంపీలంతా ఢిల్లీని ద‌డ‌ద‌డ‌లాడించారు. అయినా, మోదీ దిగిరాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ఏకంగా త‌న ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు టీడీపీ స‌భ్యులు. ఇదంతా గ‌తం. కానీ, వ‌ర్త‌మానంలో వ్య‌వ‌హారం మారిపోయింది. ప్ర‌త్యేక హోదా సాధిస్తానంటూ హామీ ఇచ్చి.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. అంద‌ల‌మెక్క‌గానే ఢిల్లీ వెళ్లి హోదాపై మ‌న‌మేమీ చేయ‌లేమంటూ చేతులెత్తేయడంతో అంతా షాక్‌. ఇక అప్ప‌టి నుంచి ఈ మూడేళ్ల‌లో స్పెష‌ల్ స్టేట‌స్ పాచిపోయిన ల‌డ్డూనే అయింది. జ‌న‌సేనాని అప్ప‌ట్లో అరిచి గీపెట్టి.. ఆ త‌ర్వాత సైలెంట్‌ అయిపోయారు. మూడేళ్లుగా ఉలుకూప‌లుకూ లేకున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం స‌డెన్‌గా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌లు, ఏపీకి ప్ర‌త్యేక హోదాపై క‌మిటీలో చ‌ర్చి అంటూ తేనెతెట్టును క‌ద‌ల్చ‌డం కాక‌తాళీయ‌మేమీ కాద‌ని.. అంతా వ్యూహ‌త్మ‌క‌మ‌నే అంటున్నారు. 

అయితే, అడ‌గందే, ఉద్య‌మాలు, పోరాటాలు జ‌ర‌గందే.. హోదా ఇచ్చేస్తే అంత‌గా క్రెడిట్ రాద‌నుకుందో ఏమో.. ముందు ఎజెండాలో చేర్చి.. ఆ తర్వాత నాలుక క‌రుచుకుని.. చ‌ర్చ‌ల జాబితా నుంచి స్పెష‌ల్ స్టేట‌స్ టాపిక్‌ను తొల‌గించేసింది. అంటే.. గ‌ట్టిగా పోరాడితే ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని కేంద్రప్ర‌భుత్వం హింట్ ఇచ్చిందా? అనే అనుమానం. ఈ ఘ‌ట‌న‌తో రేప‌టి నుంచి ఏపీలో స్పెష‌ల్ స్టేట‌స్ కోసం మ‌రోసారి ఉద్య‌మం మొద‌లైనా ఆశ్చ‌ర్యపోన‌వ‌స‌రం లేదు. ఆ హోదా పోరాటంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన‌, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌.. అన్ని పార్టీలు మేమంటే మేమంటూ రోడ్డెక్కినా ఎక్కుతారు. ఇలా హోదా చిచ్చు ర‌గిల్చి.. ఎన్నిక‌ల నాటికి స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చేసి.. ఆ మేర‌కు ఏపీలో లాభ‌ప‌డాల‌ని.. యూపీలో కోల్పోయిన సీట్ల‌ను ఏపీలో క‌వ‌ర్ చేసుకోవాల‌నేది బీజేపీ స్కెచ్‌లా క‌నిపిస్తోంది. అయితే, అదంత ఈజీగా సాధ్యం అయ్యే ప‌ని మాత్రం కాద‌ని క‌మ‌ల‌నాథుల‌కూ తెలుసు. అందుకే, ఏదో ఒక పార్టీతో జ‌త‌క‌ట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఒక‌వేళ పొత్తు పెట్టుకోవాల్సి వ‌స్తే.. బీజేపీ ఎవ‌రి వైపు మొగ్గు చూపుతుంద‌నేది ఆస‌క్తిక‌రం. పాత మిత్రుడు చంద్ర‌బాబుతో చేయి క‌లుపుతుందా? ర‌హ‌స్య స్నేహితుడు జ‌గ‌న్‌కే జై కొడుతుందా? లేక‌, ఒక‌సారి ఇదే హోదాపై బీజేపీని తెగ తిట్టిపోసి.. మ‌ళ్లీ త‌మ‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేస్తుందా? అనేది ఏపీ రాజ‌కీయాల‌ను అమాంతం మార్చేయ‌గ‌ల కీల‌క ప‌రిణామం.