TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమ్లా వ‌ర్సెస్ వ‌కీల్‌.. జ‌న‌సేనానితో డ‌బుల్ గేమ్‌!.. జ‌గ‌న్ కోస‌మేనా?

Published on: Sun Feb 27, 2022 3:56PM

ఒక విష‌యం గ‌మ‌నించారా? భీమ్లా నాయ‌క్ వ‌ర్సెస్ జ‌గ‌న్ స‌ర్కార్‌.. వివాదంలో బీజేపీ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తోంది. పీకే సినిమాను ప్ర‌భుత్వం తొక్కేసే ప్ర‌య‌త్నం చేసిందంటూ అంతా మండిప‌డుతున్నారు. కావాల‌నే టికెట్ రేట్ల పెంపు జీవోల‌ను ఆల‌స్యం చేశారంటూ ఆరోపిస్తున్నారు. పీకే ఫ్యాన్స్‌తో పాటు టీడీపీ శ్రేణులు సైతం జ‌గ‌న్‌రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఏకంగా చంద్ర‌బాబు నాయుడే భీమ్లా నాయ‌క్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి.. ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టారు. ఈ గొడ‌వ‌లో.. ఎక్క‌డా కూడా బీజేపీ వాయిస్ వినిపించ‌కపోవ‌డం ఆస‌క్తిక‌రం. అంత‌కుమించి అనుమానాస్ప‌దం. అస‌లేం జ‌రుగుతోంది? జ‌న‌సేనానికి స‌పోర్ట్‌గా క‌మ‌ల‌నాథులు ఎందుకు మాట్లాడ‌టం లేదు? జ‌గ‌న్‌రెడ్డిని ఎందుకు నిల‌దీయడం లేదు? గ‌తంలో వ‌కీల్‌సాబ్ సినిమా అప్పుడు గోల‌గోల చేసిన కాషాయ ద‌ళం.. భీమ్లా నాయ‌క్‌కు వ‌చ్చేస‌రికి ఎందుకిలా సైడ్ అయిపోయింది? వారిద్ద‌రి మ‌ధ్య చెడిందా? లేక‌, ఆ ఇద్ద‌రూ ఏక‌మ‌య్యారా? ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్‌గా ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

అవును, గుర్తుండే ఉంటుంది. ఇంచుమించు ఏడాది క్రితం. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీ రిలీజ్‌. అంత‌కు కొద్దిరోజుల ముందే సినిమా టికెట్ల ధ‌ర‌లు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. పవ‌న్ సినిమాను అడ్డుకునేందుకే ఇలా టికెట్ రేట్లు త‌గ్గించారంటూ అప్ప‌ట్లో జ‌న‌సైనికుల‌తో పాటు క‌మ‌ల‌నాథులూ తీవ్ర స్థాయిలో ఆందోళ‌న చేశారు. అదే స‌మ‌యంలో తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి ఉప ఎన్నిక‌ల టైమ్ కావ‌డంతో.. వ‌కీల్‌సాబ్ ఇష్యూని రాజ‌కీయంగా వాడేసుకున్నారు. బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీత్ ధియోద‌ర్ అయితే.. వ‌కీల్ సాబ్ మూవీ రిలీజ్ రోజున తిరుప‌తిలో ఓ థియేట‌ర్ బుకింగ్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర హ‌ల్‌చ‌ల్ చేశారు. టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుపై.. జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా మిత్ర ప‌క్ష‌మైన బీజేపీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. 

కానీ, ఇదంతా గ‌తం. ప్ర‌స్తుతం రాజ‌కీయ సమీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి. అందుకే కాబోలు.. భీమ్లా నాయ‌క్ విష‌యంలో బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తున్నారేమో అనిపిస్తోంది. వ‌కీల్‌సాబ్‌కు గొడ‌వ గొడ‌వ చేసిన కాషాయ ద‌ళం.. ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయారు. భీమ్లా నాయ‌క్ కోసం సీబీఎన్ స్పందించినా.. క‌మ‌ల‌నాథులు మాత్రం కామ్‌గా ఉండిపోయారు. ఎందుకు? జ‌న‌సేన‌ను బీజేపీ ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా?  వారి పొత్తు.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డేనా?  బీజేపీ ఎంపీ జీవీఎల్ డైరెక్ష‌న్‌లో కాషాయ ద‌ళం.. జ‌గ‌న్ స‌ర్కారుకు కొమ్ము కాస్తోందా? ప‌వ‌న్‌కు హ్యాండ్ ఇచ్చి.. జ‌గ‌నన్న‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వ‌నుందా? అనే డౌట్స్‌. 

తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక నాటి నుంచే జ‌న‌సేన‌-బీజేపీల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. తిరుప‌తి సీటు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. కానీ, క‌మ‌ల‌నాథులు పీకేను కాద‌ని.. తామే పోటీకి దిగారు. జ‌న‌సేనాని హ‌ర్ట్ అయ్యారు. ఒక రోజు ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ఫ‌లితం.. తిరుప‌తిలో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ త‌ర్వాత నుంచీ బీజేపీ-జ‌న‌సేన క‌లిసింది లేదు. ప‌వ‌న్‌ను క‌మ‌ల‌నాథులు మీట్ అయిందీ లేదు. ఆ గ్యాప్ అలానే కంటిన్యూ అవుతూ.. మ‌రింత పెరుగుతూ వ‌స్తోంది. భీమ్లా నాయ‌ర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచ‌కుండా జీవో ఆల‌స్యం చేసినా.. థియేట‌ర్ల ద‌గ్గ‌ర రెవెన్యూ సిబ్బందిని మోహ‌రించి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసినా.. బీజేపీ నుంచి రావాల్సిన మినిమ‌మ్ రియాక్ష‌న్ కూడా రాలేదు. వ‌కీల్ సాబ్ టైమ్‌లో పోరాడిన వాళ్లే.. భీమ్లా నాయ‌క్ వ‌చ్చేస‌రికి ఎందుకు సైడ్ అయ్యారంటే.. ఇదంతా జ‌గ‌న‌న్న కోస‌మ‌నే ఆన్స‌ర్ వినిపిస్తోంది. జీవీఎల్ వ‌ల్లేన‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

అవును, బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు మొద‌టినుంచీ టీడీపీ-చంద్ర‌బాబుకు బ‌ద్ద వ్య‌తిరేకి. జ‌గ‌న్ అంటే సానుభూతి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ఎండ‌గ‌ట్ట‌డం కంటే కూడా.. చంద్ర‌బాబుపై, ఆనాటి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు జీవీఎల్‌. ఇక‌, యూపీలో బీజేపీ గ్రాఫ్ ప‌డిపోవ‌డంతో.. ఆ త‌గ్గుద‌ల‌ను ఏపీలో పెరుగుద‌ల‌గా మార్చుకోవాల‌నేది బీజేపీ స్కెచ్‌. ఆ మేర‌కు జీవీఎల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని తెలుస్తోంది. అందుకే, జ‌గ‌న్‌రెడ్డిపై జీవీఎల్‌కు ఈమ‌ధ్య‌ ప్రేమ డోసు మ‌రింత ఎక్కువైంద‌ని అంటున్నారు. జ‌న‌సేన‌తో క‌లిసి ఉంటే పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని న‌యానో, భ‌యానో దారికి తెచ్చుకొని.. ఎన్నిక‌ల్లో లాభం పొందాల‌నేది క‌మ‌ల వ్యూహం. జ‌గ‌న్‌రెడ్డితో దోస్తీ పెర‌గాలంటే.. జ‌న‌సేనానితో దూరం జ‌ర‌గాలి. అందుకే.. వ‌కీల్ సాబ్ విష‌యంలో పీకేకు మ‌ద్ద‌తుగా ముందుకొచ్చిన బీజేపీ.. భీమ్లా నాయ‌క్ కోసం మాట కూడా మాట్లాడ‌టం లేదు. జీవీఎల్ ఆదేశాల‌తోనే క‌మ‌ల‌నాథుల నోరు మూత‌ప‌డింద‌ని అంటున్నారు.

అటు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం క‌మ‌ల‌నాథుల‌తో ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టే ఉంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కేంద్రంపై పోరాడుతున్నారు. ప‌రిస్థితి చూస్తుంటే.. జ‌న‌సేన-బీజేపీల బంధంకు బీట‌లు వారిన‌ట్టే క‌నిపిస్తోంది. భీమ్లా నాయ‌క్‌తో ఆ రెండు పార్టీల‌ తెగ‌దెంపుల‌పై మ‌రింత క్లారిటీ వ‌స్తోంది. మ‌రి, బీజేపీ కాద‌నుకుంటే.. జ‌న‌సేన‌కు న‌మ్మ‌ద‌గిన స్నేహితుడు ఎవ‌రో అంద‌రికీ తెలిసిందేగా.. ఆయ‌నేగా..!?