నడ్డా నోట బాబు మాట.. దేనికి సంకేతం!
Published on: Wed Jun 8, 2022 8:12AM
బీజేపీ స్వరం మారిందా? రాష్ట్రంలో పొత్తుల గురించి పల్లెత్తు మాట మాట్లాడినా సహించబోమని ఏపీ బీజేపీ నాయకులను
హెచ్చరించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగిన గోదావరి గర్జన సభలో క్విట్
వైసీపీ నినాదం ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ ను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ ఎలుగెత్తారు. తెలుగుదేశం మహానాడులోనూ, అంతకు ముందు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాల పర్యటనల్లొనూ ఇదే చెప్పారు. నడ్డా కూడా సరిగ్గా ఇదే చెప్పారు.
అయితే ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రసంగించారు కనుక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటూ ముక్తాయించారు అది వేరే విషయం. రాజమహేంద్రవరంలో జరిగిన బీజేపీ గోదావరి గర్జన సభ వేదికగా ఆయన వైసీపీ ఆర్థిక క్రమశిక్షరా రాహిత్యం గురించి, కరెంటు కష్టాలు, పన్నులు, అప్పులు ఇలా ప్రతి అంశంలోనూ ఆయన విమర్శలు చంద్రబాబు వైసీపీపై చేస్తున్న విమర్శలను పోలి ఉన్నాయి. వైసీపీ సర్కార్ రాష్ట్రంలో విపక్షాలను తిరగనీయడం లేదనీ, మాట్లాడనీయడం లేదనీ నడ్డా చేసిన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేయడంపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే ఏపీలో బీజేపీ జగన్ ప్రభుత్వంపై ఇప్పటి వరకూ పోరాడింది లేదు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిందీ లేదు. వైసీపీ ప్రభుత్వం బీజేపీ నేతలను, కార్యకర్తలనూ వేధించిందీ లేదు. ఇంత వరకూ వైసీపీ, బీజేపీల మధ్య ఉన్నది స్నేహపూర్వక వైరుధ్యమేనని విశ్లేషకులు వివరాలతో సహా వివరిస్తున్నారు. దీంతో నడ్డా రాష్ట్రంలో పొత్తలపై ఎవరూ నోరెత్తదని హెచ్చరించడం, పురంధేశ్వరి వంటి బీజేపీ నేతలు గతంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకునేది పార్టీ అగ్రనాయకత్వం కానీ, ఇక్కడి నేతలకు కాదని సోము వీర్రాజు వంటి వారికి ఝలక్ ఇచ్చేలా ప్రకటనలు చేయడం గమనిస్తే.. బీజేపీ స్వరం మార్చుకుంటోందనీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అడుగు వేస్తోందని అవగతమౌతోందని రాజకీయ వర్గాలలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ గోదావరి గర్జనకు హాజరైన జనం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే బీజేపీకి అంత మంచింది. ప్రతిష్ఠాత్మకం అంటూ ఆ పార్టీ ఎంతో ఆర్భాటం చేసి నిర్వహించిన రాజమహేంద్రవరం సభ జనం లేక వెలవెల పోయింది.
ఆ సభకు వచ్చిన జనాన్ని చూడగానే నడ్డాగారికి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటన్నది అర్ధమైపోయి ఉంటుంది. బీజేపీ రాష్ట్ర నాయకుడి సత్తా, జనంలో, పార్టీలో ఆయనకు ఉన్న పలుకుబడి తేటతెల్లమై పోయి ఉంటుంది. వైసీపీతో అంటకాగితే, బీజేపీకి రాష్ట్రంలో ఉన్న నామమాత్రపు ఉనికి కూడా మాయం కావడం ఖాయమని తేలిపోయి ఉంటుంది. అందుకే గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఆయన వైసీపీపై విమర్శలు సంధించారు. ఏదో మాటవరసకు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అన్న మాట అన్నప్పటికీ.. రాష్ట్ర సర్కార్ ను ఆయన విమర్శించడానికి రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షం జనసేనను ఆదర్శంగా తీసుకోలేదు. విపక్షం తెలుగుదేశం జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆర్థిక అధోగతిని ఎత్తి చూపుతూ వెల్లడించిన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకున్నారు. అందుకే నడ్డా ప్రసంగమంతా చంద్రబాబు జగన్ సర్కార్ పై చేసిన విమర్శలను మళ్లీ తన నోట వినిపించడానికే పరిమితమైంది.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నడ్డా విమర్శించారు. అంత అడ్డగోలుగా అప్పులు చేయడానికి అనుమతించినది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వమేనని కన్వీనియెంట్ గా మరచిపోయారు. అన్ని రాష్ట్రాల్లో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తుంటే... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇంగ్లీషు మీడియం బడులు అంటూ జగన్ ఆర్భాటంగా ప్రకటన చేసిన సందర్భంగా తెలుగు సంగతేమిటంటూ తొలుత నిలదీసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబే.
జగన్ ఆంగ్ల మీడియం ప్రకటనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇంత వరకూ ఒక్క మాట కూడా అనలేదు. ఇక జగన్ హయాంలో అవినీతి, ఇసుక, ల్యాండ్, మద్యం మాఫియాల గురించి విమర్శలు, ఆందోళనలకు రాష్ట్రంలో నాయకత్వం వహించింది తెలుగుదేశమేనన్న సంగతి తెలిసిందే. సొంతంగా రాష్ట్రానికి ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ సర్కార్ అవినీతి, దుర్మార్గాలపై గట్టిగా నిలదీస్తున్న తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడానికి నడ్డా జంకారన్నది పరిశీలకులు, ప్రజలు సైతం బాహాటంగానే చెబుతున్నారు. ఇంత కాలం రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగానే జాతీయ నేత వచ్చినా బీజేపీ గోదావరి గర్జన సభకు జనం కరవయ్యారని అంటున్నారు.


