ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆటలు సాగుతాయా?

బీజేపీ అధినేత అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని విజయవంతం చేసే బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. కన్నా కూడా ఇలాంటి కార్యక్రమం కోసం మంచి హుషారుగా ఎదురుచూస్తున్నారు. అసలు కన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన దగ్గర్నుంచే, ఆయన చంద్రబాబు మీద విరుచుకుపడిపోతున్నారు. మాటిమాటికీ మాట మార్చే చంద్రబాబులో తనకి ఓ అపరిచితుడు కనిపిస్తున్నాడనీ, రాజధాని నిర్మాణం కోసం దేశాలన్నీ తిరిగి చివరికి రాజమౌళి చెంతకు చేరుకున్నాడనీ దూకుడుగా విమర్శలు చేశారు. మరోవైపు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా బీజేపీ మీద చీమ కూడా వాలనివ్వడం లేదు.

నిజానికి ఒకప్పటి బీజేపీ వేరు ఇప్పటి బీజేపీ వేరు. ఒకప్పుడు బీజేపీ దృష్టి కేవలం ఉత్తరాది మీద ఉండేది. ఆ ఉత్తరాది సాయంతో ఎలాగొలా దిల్లీ పీఠాన్ని దక్కించుకుంటే చాలనుకునేది. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఏకంగా 80 పార్లమెంటు సీట్లు ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చిన అంశం. కానీ మోదీ- అమిత్‌షాల ద్వయం అధికారంలోకి వచ్చాక ఈ తీరు మారిపోయింది. దేశంలో ఎంత మారుమూల ప్రదేశమైనా సరే.. దాన్ని కూడా బీజేపీ ఖాతాలోకి చేర్చుకోవాలనే పంతం వారిది. అందుకే మోదీగారు అయితే విదేశీ పర్యటనల్లోనో లేకపోతే ఎన్నికల ప్రచారంలోనో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

అలాంటి మోదీ-అమిత్‌షాలకు దక్షిణాది కొరకరాని కొయ్యగా మారింది. అటుచూస్తే కేరళలో కమ్యూనిస్టులు పాగా వేశారు. ఇటుచూస్తే కర్ణాటకతో దారుణమైన గర్వభంగం జరిగింది. అక్కడ బీజేపీ ఎత్తుని పారనివ్వకుండా ఏకంగా సుప్రీం కోర్టే జోక్యం చేసుకుంది. ఇక తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే ఉంది. బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి వంటి బలమైన నేతలు ఇక్కడ ఉన్నా, కాంగ్రెస్‌తో సమానంగా ప్రతిపక్ష పాత్రని నిర్వహించలేకపోతున్నారు. క్రితం ఏడు ఏకంగా అమిత్‌షానే తెలంగాణకి వచ్చి ఇక్కడి శ్రేణులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ మీద విమర్శలు ఎక్కుపెట్టి, సొంత లాభం కొంత పొందాలనుకున్నారు. కానీ ఆ విమర్శలని తీవ్రంగా తిప్పికొట్టిన కేసీఆర్‌ ‘అమిత్‌షా గిమిత్‌షా’ల ఎత్తులు ఇక్కడ పారవని ఎద్దేవా చేశారు. దీంతో తటస్థంగా ఉన్న తెరాసతో అనవసరంగా తలంటుకోకూడదన్న ఆలోచనతో బీజేపీ మరింత మెత్తబడింది.

ఇక మిగిలిందల్లా ఆంధ్రప్రదేశ్‌! ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఆంధ్రాలో బీజేపీ నేతలు టీడీపీని దీటుగానే ఎదుర్కొంటున్నారు. ఇక జాతీయ కార్యవర్గం కూడా ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగువారైనా రాంమాధవ్‌, మురళీధరరావు, జీవీఎల్‌ నరసింహరావు ప్రభుతులు ఆంధ్రాలో బీజేపీ విజయాన్ని బలంగా కోరుకుంటున్నారు. తమ ఆశలను ఒక అడుగు ముందుకు వేయించేందుకే వారు కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు.

కాపు సామాజికవర్గానికి చెందిన లక్ష్మీనారాయణను ఎంపిక చేయడం ద్వారా, చంద్రబాబు మీద కాస్త గుర్రుగా ఉన్న ఆ వర్గాన్ని తమవైపుగా తిప్పుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. కన్నా లక్ష్మీనారాయణ... పదీ ఇరవై కాదు, ఏకంగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవాడు. కాంగ్రెస్‌లో పలు మంత్రిత్వశాఖలను నిర్వహించినవాడు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఇప్పుడప్పుడే మంచిరోజులు లేవని భావించి తెలివిగా బీజేపీ వైపు చేరాడు. ఆయనను తక్కువగా అంచనా వేయడానికి లేదు.

కన్నా, విష్ణువర్ధన్‌, సోము వీర్రాజు వంటి నేతలు బలపడుతున్నంత మాత్రాన ఆంధ్రాలో బీజేపీ అచ్ఛేదిన్‌ వచ్చేస్తాయని భావించలేం. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న అక్కసు ఆంధ్రాలో ప్రతి పౌరుడికీ ఉంది. దానికి తోడు పెరిగిపోతున్న నిరుద్యోగం, బ్యాంక్‌ స్కాంలు, జీఎస్టీ లోపాలు, పెట్రోలు ధరలు... లాంటి సవాలక్ష సమస్యలు మోదీ పరువును ఈపాటికే సగానికి సగం తగ్గించేశాయి. ఒకవేళ చంద్రబాబు మీద ఓటర్లకు అసంతృప్తి ఉంటే దాన్ని ఓట్ల కిందకి మార్చుకునేందుకు వైకాపా, జనసేన సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఓట్లని రాబట్టుకోవాలంటే ఏదో ఒక బ్రహ్మాస్త్రంతో బీజేపీ ముందుకు రావల్సిందే! అంతవరకు ఆంధ్రాలో బీజేపీ అద్భుతాలు సాధిస్తుందని ఊహించలేం!!!